గతంలో పట్టణాల్లో క్రికెట్ బెట్టింగులు ఎక్కువగా జరిగేవి. కానీ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ అది పల్లెలకు పాకింది. గ్రామీణ యువత రూ.100 నుంచి మొదలుకుని రూ.వేలల్లో బెట్టింగుల్లో పోగుట్టుకుంటున్నారు. మ్యాచ్ ఆరంభం నుంచి మొదలుకుని ఆఖరి బంతి వరకు పందేలు కాస్తున్నారు. టాస్ నుంచి మొదలుకుని బంతి బంతికి ఫోర్, సిక్సర్, వికెట్‌కు డబ్బులు పెట్టి బెట్టింగ్‌లు కాస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో బెట్టింగ్ జరుగుతుందని సమాచారం.
అంతా చరవాణుల్లోనే..యాప్‌ల ద్వారా పేమెంట్స్
అయితే ఇదంతా చరవాణుల్లోనే బయటకు తెలియకుండా జరుగుతోంది. వీటికి వేదికలుగా ఆన్‌లైన్ పేమెంట్ విధానంలో వివిధ యాప్‌ల ద్వారా డబ్బులు బదిలీ చేసుకుంటున్నారు. ఇష్టమైన జట్లను ఎంచుకుని పందెం డబ్బులను మధ్యవర్తికి బదిలీ చేస్తారు. ఆ తర్వాత గెలిచిన వారికి మధ్యవర్తి కమిషన్ తీసుకుని ఇస్తారు. కొందరు నేరుగా కూడా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. పెట్టిన సొమ్ము ఎప్పటికప్పుడే ఇచ్చిపుచ్చుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకున్నా ఎవరికీ బయటకు చెప్పుకోవడం లేదు. యువత దీనికి ఎక్కువగా అలవాటు పడుతోంది. ఇందుకు అప్పులు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో స్నేహితుల మధ్య పొరపొచ్చలు వస్తున్నాయి. గతంలో ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి బెట్టింగ్‌లో రూ.5 లక్షలు పోగొట్టుకుని కెరీర్‌నే నాశనం చేసుకున్నాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. అంతకు ముందు ఓ బుకీ కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్‌కు పాల్పడంతో స్థానికుల నుంచి విమర్శలు రాగానే అక్కడి నుంచి పారిపోయారు.