మేడారంలో మండమెలిగే పండుగకు సర్వం సిద్ధమైంది. మహా జాతరకు వారం ముందు ఆదివాసీలు తమ సంప్రదాయలకు అనుగుణంగా ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేకువజామునే ఆలయాన్ని శుద్ధి చేసి దిష్టి తోరణాలతో పాటు... నియమనిష్ఠలతో గద్దెలను కడిగి పూజలు చేసి ముగ్గులు వేస్తారు.
రాత్రి గద్దెల వద్ద అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి... జాగారాలు చేస్తారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం నుంచే దర్శనాలను నిలిపివేస్తారు. మండ మెలిగే పండుగతో... జాతరకు అంకురార్పణ జరుగుతుంది. వచ్చే బుధవారం సాయంత్రం... సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను తీసుకువచ్చిన అనంతరం... మహా జాతర వైభవంగా ప్రారంభమవుతుంది.
వనదేవతల జాతర సమీపిస్తున్నందున అక్కడి ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్షించారు. దాదాపు 99 శాతం పనులు పూర్తైనట్లు వెల్లడించారు. మిగిలిన వాటిని నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరను విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహణకు భక్తులు సహకరించాలని మంత్రి కోరారు.