ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం? రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర పేరు చెప్పి గుత్తేదారులు పండగ చేసుకుంటున్నారు. నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి నిధులు కొల్లగొడుతున్నారు. జాతరకు తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం కొన్ని శాశ్వత నిర్మాణాలు, మరికొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపడుతుంటారు. మరుగుదొడ్లు, స్నాన వాటికలు, తాగునీటి బోర్లు, విద్యుత్తు పరికరాలు, సీసీ కెమెరాలు, షెడ్లు, చలువ పందిళ్లు తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల పునరుద్ధరణ, భవనాలు, వంతెనలు, కల్వర్టుల మరమ్మతులు, నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలలో ఉంటున్నాయి. సమయం లేదనే సాకుతో షార్ట్ టెండర్ల పేరున కొన్ని పనులను, ఆన్‌లైన్ టెండర్ల ద్వారా మరికొన్ని పనులను ఖరారు చేశారు. నిశిత పర్యవేక్షణ లేకపోవడంతో చాలా వరకు పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది.
ఘాట్లకు అనేకచోట్ల పగుళ్లు..
మట్టి, గడ్డి, రాళ్లురప్పలు కలగలిసిన ఇసుకను; నాణ్యత లేని ఇటుకలను పనులకు వినియోగిస్తున్నారు. నిర్మాణాల అనంతరం క్యూరింగ్ (నీటితో తడపడం) చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఘాట్లకు అనేకచోట్ల పగుళ్లు వచ్చాయి. మెట్లు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. పైగా సున్నం వేసి కప్పేస్తున్నారు.
తాత్కాలిక పనుల్లో డొల్ల..
తాత్కాలిక పద్ధతిలో నిర్మిస్తున్న మరుగుదొడ్లలోనూ నాణ్యత లేదు. జాతర నాలుగు రోజుల పాటు భక్తులు వినియోగించుకునేందుకు వీటిని నిర్మిస్తున్నా... అప్పటి వరకు ఉండేటట్లు కనిపించడం లేదు. ఇప్పుడే సిమెంటు రాలిపోతోంది. ఒక్కో నిర్మాణాన్ని ఎంతలేదన్నా మూడు, నాలుగువేల మంది ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. సిమెంటులో మట్టి కలిపి పూస్తున్నారు. ఇలా వేల సంఖ్యలో నిర్మాణాలను మమ అనిపిస్తున్నారు.
చిలకలగుట్టకు చేరేదారిలో..
మేడారం ఆలయం నుంచి చిలకలగుట్టకు వెళ్లే రోడ్డును ఈ సారి మరింతగా విస్తరించి, సుందరీకరించాలని నిర్ణయించారు. రూ.1.20 కోట్లతో పనులు చేపట్టారు. రోడ్డు పక్కనే నాలుగు మీటర్ల మేర పరుస్తున్న మట్టి అంతా నాసిరకంగా ఉంది. చెట్లు, వేర్లు, కట్టెలు, రాళ్లూరప్పలతో వేస్తున్నారు. పైగా ఈ నిర్మాణాన్ని చిలకలగుట్ట ద్వారం వరకే వేశారు. మరికొంత దూరం పొడిగిస్తే జంపన్నవాగు వరకు వెళ్లడానికి వీలుగా ఉంటుందని భక్తులు కోరుతున్నా ఆ దిశగా ప్రతిపాదనల్లో చేర్చలేదు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం జాతర పనులను నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా నాసిరకంగా ఉన్నట్లు తేలితే విజిలెన్సుతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం. రోడ్లు, ఇతర నిర్మాణాలు బాగాలేవనే ఫిర్యాదులు అందితే మాత్రం మళ్లీ నిర్మించేలా ఆదేశాలు జారీ చేస్తాం. జాతరను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. - వాసం వెంకటేశ్వర్లు, ఇన్‌ఛార్జి కలెక్టర్, ములుగు |
కనీసం రెణ్నెల్లయినా మన్నలేదు..!
తారు రోడ్డును చీల్చుకుని గడ్డి మొలకెత్తుతోంది. రోడ్ల మందం.. నాణ్యతను మొలకెత్తుతున్న గడ్డి సవాల్ చేస్తోంది. రూ.కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్లు కనీసం రెండు నెలలైనా మన్నాలి. దీనికి భిన్నంగా జాతర వరకు సాగితే చాలన్నట్లు ఉంది ఇంజినీరింగ్ శాఖల పర్యవేక్షణ తీరు. కన్నెపల్లి-మేడారం, జంపన్నవాగు-గిరిజన మ్యూజియం రోడ్లతోపాటు అనేక ప్రాంతాల్లో వేసిన తారు రోడ్లపై గడ్డి మొలుస్తోంది. సీసీరోడ్డుపై తారు రోడ్డు వేయడం ఎక్కడా ఉండదు. ఇక్కడే సాధ్యమైంది. కన్నెపల్లి-మేడారం మార్గంలో సీసీరోడ్డును తొలగించకుండా దానిపైనే తారు రోడ్డు నిర్మించారు. నిధులు మింగడానికే ఈ పద్ధతి ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ‘‘