యునెస్కో బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశంపై ఎంతో మేధోమథనం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ... ఈ గుర్తింపు వచ్చేలా చొరవ చూపాయి. ఈ కట్టడంలోని ప్రత్యేకతలను, విశేషాలను వివరిస్తూ... పలు నివేదికలూ అందించాయి. కరోనా కారణంగా ఈ ప్రక్రియంతా కాస్త ఆలస్యమైనా... చివరకు అందరి అంచనాలు, ఆశలను నిజం చేస్తూ అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. కాకతీయ శిల్ప కళావైభవం ఖండాంతరాలు దాటనుంది.
సహజత్వానికి సరైన చిరునామా..
శిల్పంలో శిల కనిపించకూడదు. కళ కనిపించాలి..! సహజత్వానికి సరైన చిరునామాగా ఉండాలి. శిల్పకళకు ఇంతకు మించిన ప్రామాణికత ఏముంటుంది..? ఈ రెండు అర్హతలున్న కళా వైభవం...రామప్ప సొంతం. ఇక్కడి శిల్పాల్లో సహజత్వం ఒలుకుతుంది. ప్రతి అణువూ సరిగమలు పలుకుతుంది. 8 వందల ఏళ్ల క్రితం.. ఇంతటి సాంకేతికత ఎక్కడిది..? ఇంత విభిన్నంగా ఎలా కట్టగలిగారు..? రామప్పను సందర్శించిన వాళ్లందరూ ఆ పరిసరాల్లో ఇలా మాట్లాడుకుంటూనే ఆస్వాదిస్తుంటారు.
మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే... నీటిలో తేలియాడో ఇటుకలతో ఆలయ పైకప్పు నిర్మించటం. ఆ చెక్కిన తీరు చూస్తే.. ఔరా అనకుండా ఉండలేం. అప్పట్లోనే శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఈ నిర్మాణం చేపట్టారు కాకతీయులు. ఇప్పటికీ ఆ కట్టడం చెక్కు చెదరలేదు. ఆ ఠీవీ తగ్గలేదు. ఇన్ని ప్రత్యేకతలున్న నిర్మాణానికి విశ్వఖ్యాతి దక్కేదెప్పుడో... అని అంతా ఎదురు చూశారు. ఇప్పుడా కల నెరవేరింది. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలిచిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది.
ఇదీచూడండి:RAMAPPA TEMPLE: రామప్ప కట్టడం... ఓ ఇంజినీరింగ్ అద్భుతం
తెలుగునాట ఈ హోదా దక్కిన మొదటి కట్టడం రామప్ప. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతగల వారసత్వ కట్టడాలు, సహజ వింతలు, రెండు కలిసిన ప్రాంతాలకు వారసత్వ హోదా ఇస్తుంది. ఇలా మన దేశంలో ఇప్పటివరకు 38 ప్రాంతాలకు గుర్తింపు ఇచ్చింది. రామప్ప దేశంలో 39వ కట్టడం. మహారాష్ట్రలో 6 ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు దక్కింది. మరే రాష్ట్రంలోనూ అన్ని గుర్తింపు పొందలేదు. యునెస్కో గుర్తింపు వల్ల ఆలయం కొలువై ఉన్న పాలంపేట గ్రామం అంతర్జాతీయ పర్యాటక పటంలో గుర్తింపు పొందుతుంది. పరిరక్షణ, నిర్వహణకు ప్రపంచ వారసత్వ నిధి (WHF) నుంచి నిధులు అందుతాయి. వరల్డ్ హెరిటేజ్ పబ్లికేషన్స్ ద్వారా వచ్చే ఆదాయంలో వాటా దక్కుతుంది. అంతర్జాతీయంగా అనేక స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ఇస్తాయి. కేంద్ర పురావస్తుశాఖ ఏటా ప్రత్యేక నిధులు కేటాయించి పరి రక్షించాల్సి ఉంటుంది.