తెలంగాణ

telangana

ETV Bharat / state

Minerals mining: తవ్వేద్దాం.. తర్వాత చూద్దాం

Minerals mining: రాష్ట్రంలో ములుగు జిల్లా మల్లంపల్లిలోని 20 ఎకరాల లేటరైట్‌ గనిలో ఖనిజ తవ్వకాలకు ఇచ్చిన పర్యావరణ అనుమతి గడువు గత సంవత్సరం అక్టోబరులో పూర్తయింది. నిబంధనల మేరకు అక్కడ తవ్వకాలు ఆగిపోవాలి. తర్వాత నాలుగు నెలలపాటు తవ్వుకుని, తర్వాత తీరిగ్గా లీజుదారు పర్యావరణ అనుమతుల పునరుద్ధరణకు దరఖాస్తు చేశాడు.

ఇసుక తవ్వకాలు
ఇసుక తవ్వకాలు

By

Published : Jun 29, 2022, 7:15 AM IST

Minerals mining: రాష్ట్రంలో ములుగు జిల్లా మంగపేట మండలం కత్తిగూడెంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ కోసం 4.96 హెక్టార్లలో ఇసుక తవ్వుతున్నారు. పర్యావరణ అనుమతుల గడువు గత డిసెంబరులోనే ముగిసింది. ఆ తర్వాత కొంతకాలానికి దరఖాస్తు చేయడంతో పర్యావరణ ప్రభావ అంచనా కమిటీ, అథారిటీలు ఇవ్వకుండా తిరస్కరించాయి. ఇలాంటి ఉదంతాలు తెలంగాణవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి. నిబంధనలకు పాతరేస్తుంటే క్షేత్రస్థాయిలో కట్టడి చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక దరఖాస్తుల విషయంలో పర్యావరణ అథారిటీలు, కమిటీలు కాస్త కఠినంగా వ్యవహరించినట్లే కనిపిస్తున్నా, జరిమానా విధానంతో మార్గం సుగమం చేస్తున్నాయనే విమర్శలున్నాయి.

మట్టి, మొరం, కంకర, గ్రానైట్‌, ఇసుక, క్వార్ట్జ్‌ వంటి ఖనిజాల తవ్వకాలకు లీజు, పర్యావరణ అనుమతులు తప్పనిసరి. మైనింగ్‌ లీజు గడువు గతంలో 15 ఏళ్లు ఉండగా, తర్వాత 20 ఏళ్లకు పెంచారు. గడువు దాటాక మరో 20 ఏళ్లు పొడిగిస్తున్నారు. వాస్తవంగా అనుమతులు పునరుద్ధరించుకోవాలంటే గడువుకు ఏడాది ముందే దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగిసినా తవ్వకాలు ఆగడం లేదు. తద్వారా లీజుదారులు ఆర్థికంగా లబ్ధి పొందుతుండగా, లీజు ఆదాయం, రాయల్టీ వంటి అనేక రూపాల్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది.

అలాగే మైనింగ్‌ ప్రాంతంలో ఖనిజ సంపద పరిమాణం ఆధారంగా పర్యావరణ అనుమతులను ఐదు, పదేళ్లు ఆపై వ్యవధికి ఇస్తుంటారు. ఆ గడువు దాటాక కూడా అక్కడ ఖనిజం ఉంటే మళ్లీ దరఖాస్తు చేయాలి. చాలాచోట్ల అనేక నెలలపాటు, కొన్నిచోట్ల ఏళ్లపాటు ఖనిజాన్ని తవ్వేసి తర్వాత దరఖాస్తు చేస్తున్నారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో క్వార్ట్జ్‌ తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పర్యావరణ అనుమతుల బదిలీని నిలిపివేశారు. రంగారెడ్డి జిల్లా చిన్న రావిర్యాలలో 37.35 ఎకరాల్లో ఉన్న స్టోన్‌, మెటల్‌ క్వారీలో నిబంధనల ఉల్లంఘన జరగడం, తవ్వకాలు మొదలైనప్పటికీ మైనింగ్‌ ప్లాన్‌ సమర్పించకపోవడంతో..తక్షణం నిలిపివేయాలన్న ఆదేశాలు వెలువడ్డాయి.

ముందు నిర్మాణం.. తర్వాత దరఖాస్తు:భారీ నివాస, వాణిజ్య భవనాల నిర్మాణాలకు కూడా పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. కొన్నిచోట్ల తీసుకోకుండానే నిర్మాణాలు మొదలుపెడుతున్నారు. ఆ తర్వాత ఎప్పుడో దరఖాస్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఓ ఐటీ సంస్థ పర్యావరణ అనుమతుల్లేకుండానే నిర్మాణ పనులు మొదలెట్టింది. ఆ తర్వాత దరఖాస్తు చేయడంతో పనులు నిలిపివేయాలంటూ రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అంచనాల ప్రాధికార సంస్థ ఇటీవల ఆదేశాలు వెలువరించింది.

ఇదీ చదవండి:డిగ్రీ ప్రవేశాల కోసం నేడు దోస్త్ నోటిఫికేషన్ విడుదల

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం.. ఏయే వస్తువులంటే..

ABOUT THE AUTHOR

...view details