ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి 15 ఏళ్ల క్రితం 1/2 సర్వే నంబర్ గల భూమిలో 35 ఎకరాలు, 354 సర్వే నంబర్ గల భూమిలో 35 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఆ భూమిలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి పత్తి, ఆముదం పంట సాగు చేస్తుండేవాడు. ఈ ఏడాది జామాయిల్ సాగువైపు మొగ్గు చూపి 70 ఎకరాల్లో 20 లక్షల వ్యయంతో మొక్కలు నాటించాడు. నాటిన నెలరోజులకే కొందరు కబ్జాదారులు 10 ఎకరాల్లోని జామాయిల్ మొక్కలను తొలగించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోకపోవడం వల్ల చేసేదేం లేక మళ్లీ ఆ పదెకరాల్లో జామాయిల్ మొక్కలు నాటించాడు.
ఈ నెల 26న కబ్జాదారులు మరోసారి 35 ఎకరాల్లోని జామాయిల్ మొక్కలను తొలగించారు. మల్లారెడ్డి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న తన భూమిలో కబ్జాదారులు వేములపల్లి భిక్షపతి, బంచె రాంమోహన్రెడ్డిలు వెంటపడి మరీ పంటను నాశనం చేస్తున్నారని వాపోయాడు.