Special Buses to Medaram Jatara: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. జాతర సమయంలో టీఎస్ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుందన్న ఆయన.. భక్తుల రవాణా సౌకర్యార్థం 3,845 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. మేడారం జాతర ఏర్పాట్లపై హైదరాబాద్ బస్‌భవన్‌లో సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్, అధికారులతో కలిసి మంత్రి అజయ్ సమీక్ష నిర్వహించారు.
బస్సుల్లో పూర్తిగా శానిటైజేషన్
జాతర ప్రాంగణంలో ఇప్పటికే బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లను.. దాదాపు 50 ఎకరాల్లో 42 క్యూలైన్లను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, తదితర జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఫిబ్రవరి 13 నుంచి 20వ తేదీ వరకు బస్సుల రాకపోకలు కొనసాగుతాయని మంత్రి వివరించారు.
కొవిడ్, ఒమిక్రాన్ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి.. స్పెషల్ డ్రైవ్ ద్వారా బూస్టర్ డోస్ ఇప్పించామని.. హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులను కూడా అందివ్వాలని మంత్రి ఆదేశించారు. డిపో నుంచి బయలుదేరే సమయంలో బస్సును పూర్తిగా శానిటైజేషన్ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. భక్తులకు రాకపోకల సమయంలో రవాణా పరంగా ఎలాంటి నిరీక్షణ ఉండకూడదనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో బస్సులను నడపాలని సూచించారు. సమీక్ష అనంతరం పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర వాద్యకారుడు మొగిలయ్యను మంత్రి, ఆర్టీసీ అధికారులు సన్మానించారు.