Tribal Womens Making Sanitary Napkins In Mulugu : వారంతా గిరిజన మహిళలు. అందరూ కూలీ పనులకు వెళ్లేవారే.. దొరికినప్పుడు పనులు చేసుకోవడం, లేదంటే ఇంటికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు వారంతా చిన్న తరహా పరిశ్రమ స్థాపించి ఉపాధి పొందుతున్నారు. విజయవంతంగా నడిపిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన నాయక్ పోడ్ సామాజిక వర్గానికి చెందిన గిరిజన మహిళలు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు.
2019లో ఏటూరు నాగారం ఐటీడీఏ సహకారంతో సంఘటితమైన మహిళ సభ్యులతో నిత్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిగ్రీ చదివిన శ్వేత, సిరివెన్నెల గ్రూప్ ముందుకు నడిపిస్తున్నారు. మహిళలకు ఉపయోగపడే శానిటరీ నాప్కిన్ల యూనిట్‌ను రూ.27 లక్షలతో ఏర్పాటు చేశారు. ఐటీడీఏ ద్వారా రూ.16 లక్షల రాయితీ పొందగా.. బ్యాంకు రుణం రూ.8 లక్షలు మంజూరైంది. మిగతా రెండున్న లక్షలు లబ్ధిదారుల వాటాగా సమకూర్చారు. యూనిట్‌కు సంబంధించిన యంత్రాలు, ముడిసరుకు తెప్పించుకున్నారు. ఏటూరునాగారంలో నెలరోజులు శానిటరీ నాప్కిన్ తయారీపై శిక్షణ తీసుకున్నారు.
Tribal Womens Making Sanitary Napkins : 2019 డిసెంబర్ 31 న 'గిరి' బ్రాండ్ పేరుతో శానిటరీ నాప్కిన్ల తయారీ చేపట్టి జీసీసీకి ఇచ్చేవారు. తొలినాళ్లలో కరోనా వల్ల పాఠశాలలకు సెలవులు రావడంతో ఆర్డర్లు ఆగిపోయాయి. ఐనా ఏమాత్రం వెనకడుగేయకుండా స్వయంగా ములుగు, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లోని కిరాణ దుకాణాలకు వెళ్లి మార్కెటింగ్ చేసుకున్నారు. అలా ఏడాదిపాటు కష్టపడి సంస్థను కష్టకాలంలో గట్టెక్కించారు. తర్వాత పాఠశాలలు తెరుచుకోగానే జీసీసీకి సరఫరా చేస్తున్నారు.