కరోనా కారణంగా విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోంది. పరీక్షలు రద్దవడమే కాకుండా... విద్యాసంవత్సరం కూడా వెనక్కి వెళ్తోంది. ప్రారంభం కావాల్సిన విశ్వవిద్యాలయాలు ఆలస్యమవుతున్నాయి. గిరిపుత్రుల కోసం ఉద్దేశించిన గిరిజన వర్సిటీ... వైరస్ కారణంగా ఈ ఏడాదైనా ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
ఏర్పాటుకు అన్ని సిద్ధమైనా...
ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్ల నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. జాకారం సమీపంలో అటవీ, రెవెన్యూ శాఖకు చెందిన భూములు అనువుగా ఉన్నాయని గట్టమ్మ ఆలయం వద్ద సుమారు 500 ఎకరాల్లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేని కారణంగా... వర్సిటీ కోసం భవనాలు నిర్మిస్తున్నారు. మరోవైపు విద్యాసంవత్సరం వృథా కాకుండా... ములుగు సమీపంలోని జాకారం వద్ద ఉన్న ఐటీడీఏ వైటీసీ భవనాన్ని తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి.