Bogotha waterfalls in Mulugu District : 'తెలంగాణ నయాగరా'గా ప్రసిద్ధి చెందిన బొగత జలపాతం సమస్యలతో సతమతమవుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న ఈ జలపాతం.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా ప్రాచుర్యం పొందిన ఈ జలపాతాన్ని సమస్యలు చుట్టు ముట్టాయి. సరైన వసతులు లేకపోవడంతో పర్యాటకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతి ఏడాది రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో బొగత అందాలను చూడటానికి ఇక్కడికి వస్తుంటారు. సందర్శకులకు సరైన వసతులు లేకపోవడంతో నానా అవస్థలు పడాల్సి వస్తోంది. గతేడాది వర్షాకాలంలో వరదలకు వ్యూ పాయింట్, ఈత కొలను ధ్వంసం కాగా.. నేటికీ బాగు చేయించలేదు. ఆదాయం వస్తున్నా.. సౌకర్యాలు కల్పించడంలో ఆటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని పర్యాటకులు మండిపడుతున్నారు.
అభివృద్ది చేశారు.. నిర్వహణ మరిచారు: జలపాతం వద్ద అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తున్నాయి. జలపాతం వద్ద కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేసిన వారే లేరు. ఎకో టూరిజంలో భాగంగా 2018లో రూ.92 లక్షల 70 వేలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో భాగంగా వాచ్ టవర్, చెక్ డ్యాం, నీటి కొలను, పిల్లల పార్కు, రెస్టారెంట్, పగోడాలు, జిప్ లైన్, జిప్ సైక్లింగ్ ఏర్పాటు చేశారు. నిర్వహణ లేకపోవడంతో అవన్నీ ప్రస్తుతం వినియోగంలో లేవు. ఒక సఫారీ రైడర్, 5 బ్యాటరీ ఆటోలు కొనుగోళ్లు చేయగా.. అవి కూడా మరమ్మతులకు గురయ్యాయి. జలపాతం వద్ద ఏర్పాటు చేసిన 43 సౌర విద్యుత్తు దీపాలు పని చేయడం లేదు.