Three Childrens Died in Different Incidents: రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు బాలురు మరణించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారుల అకాల మరణంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. హనుమకొండ జిల్లాలో ఓ బాలుడు ఉయ్యాల ఎక్కి ఊగుతుండగా.. చివరకు అదే ఆ చిన్నారి ప్రాణం తీసింది. దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన జన్ను సతీశ్, కల్పనల కుమారుడు జన్ను యశ్వంత్ (8), గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. శుక్రవారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన యశ్వంత్.. అక్కడే ఉన్న ఊయలలోకి ఎక్కి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఊయల తాడు యశ్వంత్ మెడకు బిగుసుకుంది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు తాడును తొలగించి.. బాలుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యశ్వంత్ అదే రోజు మృతి చెందాడు.
నీటి కుంటలో పడి విద్యార్థి మృతి: ములుగు జిల్లాలో నీటి కుంటలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. గోవిందరావుపేట మండలం సల్వాయి గ్రామంలో గడ్డ ప్రాథమిక పాఠశాలలో అల్లం రుశాంత్ రెండో తరగతి చదువుతున్నాడు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన రుశాంత్.. బహిర్భూమి కోసమని ఉపాధ్యాయుడికి చెప్పి పక్కనే ఉన్న కుంట వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన కుంట వద్దకు చేరుకొని బాలుడి మృతదేహన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహంతో పాఠశాలకు వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి.. రుశాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తండ్రి కళ్లెదుటే కుమారుడు మృతి:వనపర్తి జిల్లాలో తండ్రి కళ్లెదుటే కుమారుడు మృతి చెందాడు. నాగపూర్‌కు చెందిన నరేశ్, సంధ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన నిక్షిత్‌కు జ్వరం రావడంతో తండ్రి రేవల్లి ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ వైద్యుడికి చూపించి, మందులు తీసుకొని గ్రామానికి తిరుగు పయనమయ్యారు. దారిలో ఓ దాబా వద్ద ఆగి, బాబుకు టిఫిన్ పెట్టించి, తన భుజంపై నిద్రపుచ్చారు. అనంతరం ఆయన టిఫిన్ చేస్తుండగా ఓ బండరాయి దూసుకొచ్చి.. ఆ చిన్నారి ప్రాణాన్ని చిదిమేసింది. ఓ సామాజిక భవన నిర్మాణం కోసం దాబాకు సమీపంలో ఉన్న గుట్టను తొలగించే క్రమంలో బ్లాస్టింగ్ నిర్వహించగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ మూడు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.