వనం వీడి జనం మధ్యకు వచ్చిన సమ్మక్క, సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర ముగిసింది. ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు.. అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వరకు దర్శనాలు నిర్విరామంగా కొనసాగాయి. 6 గంటల తర్వాత పూజారులు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. డప్పు, డోలు వాయిద్యాలతో వన ప్రవేశ ఘట్టం ఆద్యంతం కోలాహలంగా సాగింది. విద్యుద్దీపాలు నిలిపేసిన అనంతరం.. వన దేవతలను గద్దెల నుంచి తరలించారు. అమ్మవార్లు వనానికి తరలుతున్న సమయంలో మేడారం పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మారుమోగాయి. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి పూజారులు తీసుకెళ్లారు. పగిడిద్ద రాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయికి తీసుకెళ్లడంతో వన ప్రవేశ ఘట్టం ముగిసింది. క్యూలైన్లలో బారులు తీరిన భక్తజనం.. వన ప్రవేశ ఘట్టాన్ని తిలకించి పరవశులయ్యారు.
మహాజాతర విజయవంతం..
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జాతరకు నెల రోజుల ముందు నుంచే.. మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. 50 లక్షల మందికిపైగా భక్తులు.. జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. వేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. తాగునీటి విషయంలో.. జనం కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి కోటీ 30 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఏ లోపాలు లేకుండా జాతర విజయవంతంగా జరిగిందని తెలిపారు.