MEDARAM Special Busses : ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర సందర్భంగా ఆర్టీసీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను ఆయన దర్శించుకున్నారు. ఈనెల 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం జాతర సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి నాలుగు వేలకు పైగా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
RTC MD Sajjanor Visit MEDARAM : భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన రీతిలో బస్సులను ఏర్పాటు చేశామని... ప్రైవేటు వాహనాల్లో రాకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సూచించారు. ప్రైవేటు వాహనాలు గద్దెలకు 56 కిలోమీటర్ల దూరంలో ఆగుతాయని... కానీ ఆర్టీసీ బస్సులు గద్దెలకు కిలోమీటర్ దూరం వరకు వస్తాయని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రైవర్లు కండక్టర్లు కావలసిన సిబ్బంది మొత్తం 12,500 మందిని ఏర్పాటు చేశామని... సీనియర్ అధికారులు 300 మంది విధుల్లో ఉంటారని అన్నారు. ఏపీ నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చే వారికోసం 30 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.