మావోయిస్టుల కట్టడికి పోలీసులు ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నారు. వారు దాడిచేసి పారిపోవడానికి అనుకూలంగా ఉన్న దారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముమ్మరంగా కూంబింగ్ జరుగుతున్నా.. జంకు లేకుండా ములుగు జిల్లాలో అధికార పార్టీ కార్యకర్తను హతమార్చిన సంఘటన పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. దీనికి గల కారణాలను అధ్యయనం చేస్తున్న అధికారులు ప్రధానంగా భౌగోళిక అంశాలపై దృష్టి సారించారు. తప్పించుకునేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి కొయ్యాడ సాంబయ్యతోపాటు ఏటూరునాగారం-మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి ముచ్చకి ఉంగ్లా అలియాస్ సుధాకర్, చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ తదితరులు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
భౌగోళికంగా అనుకూల ప్రాంతాలు
ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల భౌగోళిక స్వరూపం కొంత భిన్నంగా ఉంటుంది. కొత్తగూడెం జిల్లాలోని చర్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలు గోదావరి అవతల ఛత్తీస్‌గఢ్‌తో కలిసే ఉంటాయి. ఇది మావోయిస్టులకు అనుకూలించే అంశం. అందుకే ఈ మూడు మండలాల్లో వారి కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయి. గత ఏడాది చర్ల మండలం మిడిసిలేరు ఎంపీటీసీ శ్రీనివాసరావును హతమార్చారు. నాలుగైదు నెలలుగా ఆ మండలంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే చర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే దారుల వెంట చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే ములుగు జిల్లాలో తెరాస కార్యకర్త భీమేశ్వరరావును హత్య చేసిన వెంకటాపురం మండలం బోధాపురం గ్రామం ఛత్తీస్‌గఢ్‌కు అనుకునే ఉంటుంది. కొంతకాలంగా ఇక్కడ కూడా మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.