తెలంగాణ

telangana

ETV Bharat / state

Medaram Jatara 2022: మేడారం జాతర ఏర్పాట్లను రాజకీయం చేయొద్దు: మంత్రి ఎర్రబెల్లి - review on medaram jatara 2022

Medaram Jatara 2022: మేడారం జాతరకు ఈసారి 1.30 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్​ తెలిపారు. ఇంత పెద్ద జాతర చేస్తున్న సమయంలో చిన్న సమస్యలొస్తే.. దానిని రాజకీయం చేయొద్దని కోరారు. 18న సీఎం కేసీఆర్​ మేడారం జాతరకు వస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Medaram Jatara 2022
మేడారం జాతర

By

Published : Feb 13, 2022, 8:20 PM IST

Medaram Jatara 2022: గతంలో మేడారం జాతరలో పొరపాట్లు జరిగాయని.. అలాంటివి ఈసారి జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. మంత్రి సత్యవతి రాఠోడ్, ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్దన్​​తో కలిసి మేడారం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. అనారోగ్య సమస్యలున్న భక్తులు.. రద్దీ తగ్గాక మేడారం వచ్చి దర్శించుకోవాలని కోరారు. జాతర సమీపంలో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటుచేసి.. వైద్య సిబ్బందిని కేటాయించమన్నారు.

మహాకుంభ మేళా తర్వాత మేడారం జాతరే పెద్దదని ఎర్రబెల్లి అన్నారు. గతంలో కోటి మంది భక్తులు వచ్చారని.. ఈసారి కోటీ ముప్పై లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మేడారం జాతర ఏర్పాట్లలో ఏ చిన్న సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని.. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రి తెలిపారు. ఇంత పెద్ద జాతర చేస్తున్నప్పుడు చిన్న సమస్యలొస్తే.. దానిని రాజకీయం చేయొద్దని కోరారు. 18న సతీసమేతంగా సీఎం కేసీఆర్​ మేడారం జాతరకు వస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

'ఈనెల 18న సతీసమేతంగా సీఎం కేసీఆర్​ మేడారం జాతరకు వస్తారు. రోజంతా జాతరలోనే ఉంటానని చెప్పారు. ఈసారి కోటీ ముప్పై లక్షల మంది జాతరకు వస్తారని అంచనా వేస్తున్నాం. చిన్న చిన్న లోపాలపై ఎవరూ రాజకీయం చేయొద్దు.. ఎక్కడైనా సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలి.'

- ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి

'ఇదే ఇదే చెప్పారు'

జాతర నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ చెప్పారు. కొవిడ్​ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వెయ్యి మంది సిబ్బందిని ముందే నియమించినట్లు చెప్పారు. జంపన్న వాగు వద్ద 200 మంది గత ఈతగాళ్లను ఉంటారని తెలిపారు. ఇప్పటి వరకు 50 లక్షల మంది భక్తులు మేడారానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని మంత్రి తెలిపారు. మేడారం జాతర గిరిజనుల సంప్రదాయాలకనుగుణంగా జరిగే జాతరని.. మంత్రులు, అధికారులు నిర్వహణ మాత్రమే చూడాలని.. వారి సంప్రదాయాలకు ఎక్కడా భంగం కలగకుండా చూడాలని.. ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు.

'గిరిజన సంప్రదాయాల ప్రకారమే జాతర నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. నిర్వహణలోనే తమ ప్రమేయం ఉండాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయి. జాతర ఏర్పాట్లపై సీఎస్​, డీజీపీ సమీక్ష నిర్వహించారు.'

- సత్యవతి రాఠోడ్​, గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి

9 వేల మంది పోలీసులతో భద్రత..

మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపడతున్నామని పోలీసులు తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లపై డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వివిధ జిల్లా నుంచి వచ్చిన 9వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 1.25 కోట్ల మంది భక్తులు జాతరకు హాజరవుతారని భావిస్తున్న పోలీసులు.. 3.5 లక్షల ప్రైవేటు, 4 వేల ఆర్టీసీ బస్సులు వస్తాయని అంచనా వేస్తున్నారు. జాతర ప్రాంతాల్లో 382 సీసీటీవీ కేమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 20 డిస్‌ప్లే బోర్డులు, 24 గంటలూ పనిచేసే భారీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని 33 పార్కింగ్ పాయింట్లు, 37 హోల్డింగ్ పాయింట్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీసు అవుట్ పోస్టు, నిలిచిపోయిన వాహనాలు ప్రక్కకు తీసేందుకు 6 త్రోయింగ్ వాహనాలు, 11 క్రేన్లు, 20 జేసీబీలు అందుబాటులో ఉంచామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 50 సమాచార కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులు ప్రమాదాలు జరగకుండా వాహనాలకు వెనుక రేడియం స్టిక్కర్లు అతికించాలని సూచించారు.

Medaram Jatara 2022: మేడారం జాతర ఏర్పాట్లను రాజకీయం చేయొద్దు: మంత్రి ఎర్రబెల్లి

ఇదీచూడండి:Medaram Jatara 2022 : మేడారం జాతరకు కేంద్రం నిధులు

ABOUT THE AUTHOR

...view details