ప్రపంచ స్థాయి కట్టడంగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి యునెస్కో ఇచ్చిన గుర్తింపును శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి విధించిన షరతుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. యునెస్కో షరతుల్లో భాగంగా పాలంపేట ప్రత్యేక ప్రాంత అభివృద్ది మండలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపింది. పాలంపేట అభివృద్ది మండలి ఏర్పాటుకు సెప్టెంబర్ వరకు గడువు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
యునెస్కో షరతుల అమలుపై కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రాష్ట్రానికి చెందిన పురావస్తు, పర్యాటక శాఖ, ములుగు కలెక్టర్ తదితర అధికారులతో సమావేశమై చర్చిస్తున్నట్లు పేర్కొంది. గత నెల 16న రాష్ట్ర అధికారులతో జరిగిన సమావేశంలో అన్ని అంశాలపై చర్చించినట్లు చెప్పారు. రామప్ప దేవాలయంలో సౌకర్యాల కల్పనలో భాగంగా నడకదారిలో లైట్లు ఏర్పాటు పూర్తిచేశామని తెలిపారు. కామేశ్వరాలయ పనులకు టెండర్ల కార్యక్రమం పూర్తయిందని, జనవరిలో పనులు ప్రారంభమవుతాయని తెలిపింది.