Special Story on Mulugu Photographer Shravan : అత్యుత్తమ ఫొటోగ్రాఫర్‌లలో ఒకరిగా నిలవాలనేది ఈ యువకుడి అభిలాష. ఎలాంటి ఫొటోనైనా జీవకళ ఉట్టిపడేలా తీయడం తన ప్రత్యేకత. ప్రకృతి అందాలను సజీవ చిత్రాలుగా మలిచేందుకు ఇతడు పడే తపన అంతా ఇంతా కాదు. అందుకే శ్రవణ్ తీసే ఫొటోలు చూపరులను కన్నార్పకుండా చేస్తాయి. ఇటీవల కేరళలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో స్వీయ ప్రతిభతో అవార్డునూ సొంతం చేసుకున్నాడు ఈ యువకుడు.
పాలంపేట గ్రామానికి చెందిన తడండ్ల శ్రవణ్, పాఠశాల దశలో బ్యాడ్మింటన్, కుస్తీ పోటీల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తండ్రి పర్యాటక శాఖ ఉద్యోగి కావడంతో సెలవు దినాల్లో ఆయనతో కలిసి తరచూ పర్యాటక ప్రాంతాలు చుట్టేసేవాడు. అక్కడికొచ్చే సందర్శకులు ఫొటోలు తీయడం శ్రవణ్ దృష్టిని ఆకర్షించింది. ఏకాగ్రతగా ఫొటో తీసే విధానాన్ని గమనించేవాడు. అలా తెలియకుండానే ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నానంటున్నాడు శ్రవణ్.
South India Travel Photographer Aravind : సౌత్ ఇండియా అందాలను క్లిక్మనిపిస్తున్న అరవింద్
ఫ్రెండ్ కెమెరా తెచ్చిచ్చిన తండ్రి : పూర్తి స్థాయిలో ఫొటోగ్రఫీపైనే దృష్టి సారించేందుకు బీటెక్ ప్రథమ సంవత్సరంలోనే చదువుకు స్వస్తి పలికాడు శ్రవణ్. ఈ రంగంలో నైపుణ్యం పెంచుకునేందుకు అనుభవజ్ఞులు తీసిన ఫొటోలు నిశితంగా పరిశీలించేవాడు. శ్రవణ్ ఆసక్తిని చూసి తన తండ్రీ ప్రోత్సహించాడు. మిత్రుని వద్ద కెమెరాను తెచ్చి ఇచ్చాడు. అప్పటి నుంచే ఫొటోగ్రఫీలో తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు కావడంతో తొలినాళ్లలో రామప్ప చెరువు, రామలింగేశ్వర ఆలయం, పల్లె సంస్కృతులపై చిత్రాలు తీసేవాడు శ్రవణ్. కష్టజీవుల శ్రమపై తీసిన ఫొటోలకు ప్రశంసలందుకున్నాడు. తన శ్రమకు క్రమంగా గుర్తింపు రావడంతో తనకంటూ ఒక సొంత కెమెరా ఉండాలని భావించాడు. చిన్నాచితకా పనులు చేసి డబ్బులు కూడబెట్టి కెమెరా కొనుక్కున్నాడు.