కాకతీయ హెరిటేజ్ సభ్యులు పాండురంగారావుతో ముఖాముఖి
రామప్ప ఆలయానికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. దీనిపట్ల మీరు ఎలా స్పందిస్తారు?
చాలా ఆనందంగా ఉంది. రామప్ప ఆలయం మన తెలంగాణలో ఉన్నందుకు అదృష్టంగా భావించాలి. ఇది మనందరం కలిసి చేసిన కృషికి సంపూర్ణ ఫలితం.
ఓటింగ్ ప్రక్రియ ఎలా జరిగింది?
యునెస్కోలో 21 దేశాలు పాల్గొంటాయి. ఆ 21 దేశాల్లో సుమారుగా 17 దేశాలు మనకు మద్దతు తెలిపాయి. రామప్ప విశిష్టత గురించి యునెస్కో ప్రతినిధులు గంటన్నర చర్చించారు. రామప్ప ప్రాముఖ్యతను వారికి వివరించాం. ఆలయం పైభాగంలో నీటిలో తేలియాడే ఇటుకల వినియోగం, కుదుపులకు చెక్కుచెదరకుండా అద్భుత శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఆలయ నిర్మాణం... తదితర విశిష్టతలు కలిగి ఉండడంతో రామప్పకు ఈ ఖ్యాతి లభించింది.
మిగతా కట్టడాలూ పరిశీలనకు వచ్చినా .. రామప్ప అగ్రభాగంలో నిలిచింది. దీనిపై ఏమంటారు?
మొదటగా మేము సీరియల్ నామినేషన్ చేశాం. వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, రామప్ప మూడింటిని నామినేషన్ చేశాం. తర్వాత జాగ్రత్తగా ఆలోచించి.. రాష్ట్ర ఆర్కియాలజీ విభాగం, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అందరి ఆలోచనల మేరకు ఈ ప్రాజెక్టును ఓకే చేశాం. అది మంచి ఫలితాన్ని ఇచ్చింది.
ప్రపంచ వారసత్వ గుర్తింపు వల్ల రామప్పకు ఏ విధంగా లాభం చేకూరబోతోంది?
ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందడం వల్ల పర్యాటక రంగంలో బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు రామప్ప ఆలయం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ఎవరైనా ఇతర దేశస్థులు మన దేశానికి వస్తే ముందుగా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలేంటి, ప్రపంచ స్థాయి కట్టడాలేమైనా ఉన్నాయా అని చూస్తారు. కాబట్టి దీనివల్ల మనం ఇంటర్నేషనల్ టూరిజాన్ని కలిగి ఉన్నామని చెప్పవచ్చు. దీంతో చాలా మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ స్థాయి వారసత్వ గుర్తింపు పొందిన కట్టడం కాబట్టి రాబోవు తరాలకు బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుంది.
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?
స్థానికులకు మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వనరులొస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి.
రామప్ప స్ఫూర్తితో మన రాష్ట్రంలో ఉన్న ఇతర కట్టడాలకూ వారసత్వ హోదా కోసం కృషి చేయొచ్చా?
మన చార్మినార్, వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా వీటిని కూడా ప్రపంచ వారసత్వ హోదాలోకి తీసుకెళ్లేలా మనం కృషి చేయాలి. దీనికోసం మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. రామప్ప గురించి, వారసత్వ కట్టడాల గురించి ఈటీవీ వారు ఎప్పటికప్పుడు బ్రహ్మాండమైన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కృతక్షతలు.
ఇదీ చూడండి:RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు