ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య కొలువైంది రామప్ప గుడి. ఎర్రరాయి ప్రాకారం మధ్యలో కొలువుదీరిన ఈ ఆలయానిది.. 800 ఏళ్ల చరిత్ర. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యం... ప్రతి శిలలోనూ సహజత్వాన్ని నూరి పోసింది. 12 ఎకరాల సువిశాల స్థలంలో... చుట్టూ ఉద్యానవనాలతో అలరారుతోందీ నిర్మాణం. గుడి చుట్టూ కోటగోడ దాని చుట్టూ 30 మీటర్ల వెడల్పు కలిగిన కందకపు ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. సముద్ర మట్టానికి 612 అడుగుల ఎత్తులో ఉన్న రామప్ప... నాడు ఓరుగల్లును రక్షించటంలో కీలకంగా నిలిచింది. కాకతీయుల కాలంలో రక్షణ రీత్యా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రాంతంగా రామప్ప...పేరు పొందింది.
శిల్ప వైభవానికి ప్రతీకలు
దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అవన్నీ శిల్పవైభవానికి ప్రతీకలే. ముఖ్యంగా దక్షిణ భారతంలోని తమిళనాడులో గుడుల్లోని శిల్పకళను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. అయితే.. వీటితో పోల్చి చూస్తే.. రామప్పకు మరికొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇదో ఇంజినీరింగ్ అద్భుతం. ఈ ఆలయంలో నల్లరాతి నిగారింపులు... పీఠం నుంచి శిఖరం వరకు శిల్పాలు చెక్కిన తీరు మరెక్కడా కనిపించదు. ఉత్తర దక్షిణ దేశ ప్రాంతాల సంప్రదాయాల మేలు కలయికతో ఎర్రని, నల్లని రాళ్లను నిర్మాణంలో వాడారు. ఆలయ శిఖరం బరువు లేకుండా ఉండేందుకు..నీటిలో తేలిపోయే ఇటుకలను ఉపయోగించారు.
అంతా చీకటిగా ఉన్నా..
జీవం ఉట్టిపడే శిల్ప కళాకృతుల సౌందర్యానికి మంత్ర ముగ్ధులు కావాల్సిందే. స్వరాలు పలికే శిల్పాలూ ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవు. రాతి స్తంభాల మధ్య సన్నని దారం పట్టే రంధ్రాలు ఉండటం విశేషం. ఇవేనా..? ఇంకెన్నో విశేషాలున్నాయి ఈ నిర్మాణంలో. ఆలయంలో అంతా చీకటిగా ఉన్నా గర్భగుడిలోని రామలింగేశ్వరుడిపై మాత్రం ఎప్పుడూ వెలుతురు పడుతూ ఉంటుంది. శివ తాండవం, శివకల్యాణం నాట్య రూపాలు, రామాయణ, మహాభారత, పురాణ ఇతిహాసాలు తెలిపే రమణీయమైన శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ వివిధ భంగిమలతో 12 మదనికలు, నాగిని, కోయస్త్రీ శిల్పాలు కనువిందు చేస్తాయి.
చెక్కుచెదరని స్తంభాలు
అలనాటి స్త్రీల వీరత్వాన్ని తెలిపే విగ్రహాలే కాదు..వాటి మెడలోని ఆభరణాలూ ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. నేటికీ ఆ రాతి స్తంభాలు చెక్కుచెదరకుండా ఆకర్షిస్తుంటాయి. ఆలయ దర్శనానికి వెళ్లే మార్గాన్ని వరస కట్టిన ఏనుగు బొమ్మలు తెలియజేయడం మరో విశేషం. ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు వర్షపు నీరు బయటకు వెళ్లే వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేయటం.. కాకతీయుల నాటి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.
వైపరీత్యాలను తట్టుకుని నిలిచిన కాకతీయ ఘనత
ఎన్నో యుద్ధాలు, పిడుగులు, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలిచింది. గర్భగుడికి అభిముఖంగా నంది విగ్రహం, కుడివైపున కామేశ్వర, ఎడమ వైపున కాటేశ్వరాలయాలు నిర్మించారు. వీటి నిర్మాణానికి ఎక్కువగా ఏనుగులనే వినియోగించారు. ఈ గుడిలో ఎన్నో సంస్కృతి, కళలు, సామాజిక అంశాలు కనిపిస్తాయి. రామాయణం, మహాభారతం, క్షీరసాగర మథనం, శివపార్వతుల కల్యాణం లాంటి పురాణ ఇతిహాసాలను శిల్పాలతో చెప్పే ప్రయత్నం చేశారు. నృత్య, యుద్ధ కళలనూ ఇందులో చెక్కారు. పేరిణి శివతాండవ నృత్యరూపకం ఈ గుడిలోని శిల్పాల నుంచి సేకరించినదే. ఆలయానికి కొద్ది దూరంలోనే ఉన్న రామప్ప సరస్సు నిత్యం జలకళతో ఉంటుంది. రెండు గుట్టల మధ్యన తూములు, కట్టను ఏర్పాటు చేసి ఈ సరస్సు నిర్మించారు.