మేడారం జాతర.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి.. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చుకుంటారు. గద్దెకు వెళ్లి మొక్కులు సమర్పించుకునే ప్రతీ భక్తుడు జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరిస్తాడు. జాతర సమయంలో జంపన్నవాగులో ఇసుకేస్తే రాలనంతగా భక్తుల కోలాహలం ఉంటుంది. అంత ప్రముఖ్యత ఉన్న వాగు.. ఎన్నో సమస్యలకు నిలయంగా మారింది. మహా జాతరకు సమయం ఆసన్నమవుతున్నా.. ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారాయి.
శిథిలావస్థకు స్నానఘట్టాలు..
జాతర సమయంలో హడావిడిగా పనులు చేసే అధికారులు.. నాణ్యతను గాలికి వదిలేయటం సర్వసాధారణంగా మారిపోయింది. గతంలో నిర్మించిన స్నానఘట్టాలు పగుళ్లు బారటమే అందుకు నిదర్శనం. స్నానఘట్టాలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. రెడ్డిగూడెం, మేడారం, ఊరట్టం, చిలకలగుట్ట వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉన్న స్నానఘట్టాలు.. నిర్వాహణ సరిగా లేక ఎక్కడికక్కడే పగుళ్లు బారి శిథిలమవుతున్నాయి.
కాజ్వేకు మోక్షం ఎప్పుడో..
మేడారం- ఊరట్టం గ్రామాల మధ్య 2006లో.. వాగుపై నిర్మించిన లోలెవల్ కాజ్వే 2010లో వరదకు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేశారు. ఏటూరునాగారం మీదుగా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాల నుంచి భక్తులు ఊరట్టం చేరుకుంటారు. అక్కడి నుంచి మేడారం వెళ్తారు. ఊరట్టం మీదుగా ఈ కాజ్వే నుంచి సులువుగా వెళ్లాల్సింది.. ఇప్పుడు మరో రెండు కిలోమీటర్లు తిరిగి మరో వంతెన మీదుగా మేడారంకు చేరుకోవాల్సి వస్తుంది. కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెకు తీసుకు వచ్చే సమయంలో ఈ కాజ్వే ఉపయోగపడుతుంది. అయినా ఈ కాజ్వేకు మాత్రం మోక్షం కలగడం లేదు.