Wood Smuggling in Telangana : రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, మారుమూల అటవీప్రాంతాల్లో కలప స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదీతీరాల నుంచి విలువైన కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. మరికొన్ని చోట్ల పోడుసాగు కోసం కూడా అడవిని నరికేస్తున్నారు. వరంగల్ అర్బన్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రతినిధి పర్యటించగా ఇలాంటి విధ్వంసాలెన్నో కన్పించాయి.
ఆగని అటవీ విధ్వంసం
Wood Smugglers in Telangana: రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం హరితహారం పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు పెడుతోంది. కోట్లాది మొక్కల్ని నాటిస్తోంది. మరోవైపు దశాబ్దాల క్రితం నాటి అడవులు అక్రమార్కుల స్వార్థంతో క్షీణించిపోతున్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలోని భౌగోళిక విస్తీర్ణంలో అటవీప్రాంతం 24 శాతం (దస్త్రాల ప్రకారం)గా ఉంటే, వరంగల్ అర్బన్‌లో అది 2.3 శాతమే. అయినప్పటికీ ఈ జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 4,800 ఎకరాల్లో విస్తరించిన ధర్మసాగర్(దేవనూరు) అడవులపై కన్నేసిన మైనింగ్ మాఫియా ధ్వంసానికి పాల్పడుతోంది. నేలవేము, నేల ఉసిరి వంటి ఔషధ మొక్కలు, టేకు చెట్లున్న గుట్టల్లో ఇనుప ఖనిజం, గ్రానైట్ కోసం వాటిని వేళ్లతో సహా పెకలిస్తోంది. రైళ్ల పట్టాల కింద స్లీపర్లుగా గతంలో వాడిన గట్టి కలప నార వేప చెట్లు అంతరించే దశకు చేరాయక్కడ.
మూడు రాష్ట్రాల సరిహద్దులో
Smugglers are cutting down trees : భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూరు అంతర్రాష్ట్ర సరిహద్దు. గ్రామానికి పక్కనే ఓవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు. గోదావరి, ఇంద్రావతి నదుల సంగమం. దట్టమైన అటవీప్రాంతం కావడంతో పెద్దఎత్తున కలప దందా సాగుతోంది. దమ్మూరు, లెంకలగడ్డ, సర్వాయిపేటల నుంచి ఎక్కువగా తరలుతోంది. ‘ఈనాడు’ ప్రతినిధి క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు దమ్మూరులో నది ఒడ్డున అటవీ ప్రాంతంలో దాచిపెట్టిన టేకు దుంగలు పెద్దసంఖ్యలో కనిపించాయి. ‘స్మగ్లర్లు వర్షాకాలంలో తెప్పలు కట్టి సరిహద్దు దాటిస్తారు. గోదావరిలో నీరు లేనప్పుడు ఎడ్లబండ్లలో, వాహనాల్లో రవాణా చేస్తారు. మంథని, కరీంనగర్, భూపాలపల్లి, ఏటూరునాగారం, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తారని’ స్థానిక గిరిజనులు తెలిపారు. పలిమెల, సర్వాయిపేటలో దుంగల్ని ముక్కలుగా మార్చే కలపకోత మిషన్లను అధికారులు మూయించడంతో దందా కొంత తగ్గినా రహస్యంగా సాగుతోంది.
వేగంగా క్షీణిస్తున్న అడవి
Smugglers are cutting down trees in Telangana : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో 20 ఏళ్లలో 15 వేల ఎకరాలకుపైగా అటవీభూమి అన్యాక్రాంతమైంది. కలపను అమ్ముకోవడం, పోడు సాగుతో అధికనష్టం వాటిల్లుతోంది. వాయిపేట అటవీ సెక్షన్‌లో మూడేళ్లలో ఐదుగురు అటవీ అధికారులపై వేటు పడింది. గతేడాది నుంచి సిరిచెల్మ రేంజ్‌లోనే రూ.9 లక్షల విలువైన కలప పట్టుబడింది. భీంపూర్ వెళ్లే మార్గంలో భారీ ఎత్తున టేకు చెట్లు నేలకొరుగుతున్నాయి. అధికారులు, నేతల సహకారంతో టేకు ఫర్నిచర్‌గా మారి పట్టణాలు, నగరాలకు తరలి పోతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.