పిన్ని నిర్జీవంగా పడి ఉంది. మామకు సృహలేదు.. చిట్టి తల్లి సనాకు ఎటుచూసినా చిమ్మ చీకటికి తప్ప మరేమి కనిపించలేదు. భయంతో చీకటి మబ్బులు తొలగేలా రోదించడం తప్ప. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం సమీపంలోని అభయారణ్యంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన ఇధి. మంగపేట మండల కేంద్రంలో నివసించే షేక్ రఫియా, రహీంలకు షేక్ జిలానీ(25), షేక్ సల్మా(23), షేక్ సోనీ(20) సంతానం. సల్మాకు వివాహం కాగా, ఏటూరునాగారంలో నివసిస్తోంది. సోనీ, జిలానీ కూడా అక్కడే చిన్న ఉద్యోగాలు చేస్తూ, రోజూ రాత్రి మంగపేటకు వచ్చేస్తుంటారు. సోనీ శుక్రవారం రాత్రి తన అక్క సల్మా కూతురు సనా(4)తో మంగపేటకు బయలుదేరింది. ఆటో కోసం చూస్తుండగా, సోదరుడు జిలానీ మోటారుసైకిలుపై రావడంతో చిన్నారి సనాతో అతడి బండెక్కింది.
ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్ దాటాక వేగంగా వస్తున్న లారీని తప్పించబోయి జిలానీ బైకును చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ఘటనలో సోనీ అక్కడే మృతి చెందింది. జిలానీ ఎడమ కాలు విరిగిపోగా స్పృహ తప్పి పడిపోయాడు. చిన్నారి ఏడ్చినా వినే దిక్కు లేకుండా పోయింది. అర్ధరాత్రి 2 గంటలకు జిలానీకి స్పృహ వచ్చాక... వాహనాల వెలుగులో చూడగా చెల్లెలు సోనీ నిర్జీవంగా పడి ఉంది.