త్వరలోనే... రామప్ప వైభవం విశ్వవ్యాప్తం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో కొలువైన రామప్ప ఆలయం దశాబ్దాల నుంచి అత్యద్భుత శిల్పసంపదకు ఆనవాలుగా నిలుస్తోంది. క్రీస్తు శకం 1213లో నిర్మించిన ఈ కాకతీయ కట్టడం అనేక ప్రత్యేకతల సమాహారం. ఆలయంలో చెక్కిన శిల్పాలు... సజీవ ప్రతిమల్లా కనిపించటం... రామప్ప ప్రత్యేకత. పీఠం నుంచి పైనున్న శిఖరం వరకూ సాగిన నిర్మాణ కౌశలం చూపరులను అబ్బురపరుస్తుంది. ఆలయ శిఖరం బరువు లేకుండా ఉండేందుకు... నీటిలో తేలిపోయే ఇటుకలతో నిర్మాణం చేపట్టారు. సరిగమలు పలికే శిల్పాలు రామప్ప ఆలయంలోనే కనిపిస్తాయి.
యునెస్కో బృందం పర్యటన
వారసత్వ హోదా దక్కడానికి కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్న రామప్ప ఆలయాన్ని ఈ నెలాఖరులో యునెస్కో బృందం సందర్శించనుంది. వారి రాకను పురస్కరించుకుని... దేవాలయ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పర్యటకులను ఆకర్షించే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.
మరమ్మతులు ముమ్మరం
రామప్ప పడమర ద్వారం వైపు ఉన్న దుకాణాలు తొలగించి రహదారిని విస్తరిస్తున్నారు. గొల్లగుడి నుంచి రామప్ప ఆలయంలోకి వెళ్లేందుకు నడక దారిని ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కూలిపోయిన ఆలయ ప్రహరీ గోడను పునర్నిర్మిస్తున్నారు. భూగర్భ విద్యుత్ సరఫరా పనులను ముమ్మరం చేశారు. ములుగు నుంచి రామప్ప ఆలయం వరకున్న రహదారికి ఇరువైపులా సూచిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పార్కింగ్ వసతులు కల్పించనున్నారు.
రామలింగడి దయ
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గతవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. రామప్పను ప్రపంచ ప్రఖ్యాత పర్యటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. రామలింగేశ్వరుని దయతో... రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం కావాల్సిన మేర నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతి
యునెస్కో బృందం వచ్చేలోగా మరోసారి ఆలయ అభివృద్ధి పరిశీలిస్తామని పోచంపల్లి తెలిపారు. దేవాలయ విశిష్టతను తెలిపే విధంగా సమగ్ర సమాచారాన్ని యునెస్కో బృందానికి అందించేందుకు అధికారులూ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కితే... రామప్ప వైభవం విశ్వవ్యాప్తమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతుంది.