పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి తిప్పలు తప్పడం లేదు. వివాహం అనంతరం ఆ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఇవ్వాళ రేపు అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో లబ్ధిదారులకు ఎన్నో ఏళ్లుగా కల్యాణ లక్ష్మి డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
అన్ని అనుమతులు పొందినా..
అన్ని రకాల ధ్రువపత్రాలతో మీ సేవ ద్వారా కల్యాణలక్ష్మి పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసుకుంటే తొలుత పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శులు పరిశీలిస్తారు. ఆ తర్వాత వాటిని తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయంలో పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే అనుమతి కోసం పంపిస్తారు. ఎమ్మెల్యే నుంచి అనుమతి పొందిన తర్వాత బడ్జెట్ పరిశీలన కోసం అర్హుల జాబితాను ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తారు. ట్రెజరీ అధికారులు ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ జాబితాలో ఉన్న పేర్లకు సరిపోతుందా అనేది పరిశీలించి సమ్మతి తెలుపుతారు. చెక్కుల తయారీ కోసం బ్యాంకులకు పంపిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని లబ్ధిదారుల భవిష్యత్తు అంతా బ్యాంకు అధికారుల చేతిలో ఉంది. చెక్కులు జారీ చేయకుండా అక్కడ మెలిక పెడుతున్నారు. నెలల కొద్దీ చెక్కులు విడుదల చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో ఏళ్లు గడిచినా పరిహారం అందడం లేదు.
రావాల్సినవి 600 చెక్కులు
జిల్లాలోని మొత్తం 9 మండలాల పరిధిలో కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన లబ్ధిదారులున్నారు. సుమారు ఏడాదిన్నర నుంచి కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడంలో కొంత జాప్యం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం కావాల్సినంత బడ్జెట్ను విడుదల చేయడంతో ప్రస్తుతం జిల్లాలో నిధులకు కొదవ లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే 600 చెక్కులు అన్ని అర్హతలుండి పెండింగులో ఉన్నాయి. ట్రెజరీ నుంచి చెక్కుల జారీ కోసం బ్యాంకుకు పంపించి సుమారు మూడు నెలలు దాటినా వాటి జాడ లేదు. వాటిపై పర్యవేక్షణ కొరవడింది. లబ్ధిదారులు తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కొక్కరికీ రూ.1,00,116 చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము అందితే అప్పొ సప్పో చేసి కూతురు పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చుకుందామని ఆశ పడుతున్న అమ్మాయిల తల్లిదండ్రుల ఆశలన్నీ ఆవిరైపోతున్నాయి. పరిహారం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.