తెలంగాణ సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. తనిఖీలను ముమ్మరం చేశారు. మావోయిస్టు పార్టీ కీలక నేత, భారీ దాడుల వ్యూహకర్త మాడ్వి హిడ్మా(Maoist Leader Madvi Hidma) తెలంగాణలోకి ప్రవేశించినట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఛత్తీస్గఢ్ నుంచి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలోకి ప్రవేశించారన్న సమాచారంతో కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట రహదారుల వెంబడి పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అనారోగ్య సమస్యతో మెరుగైన వైద్యం కోసం వచ్చినట్టు సమాచారం రావడంతో ఈ ప్రాంతంలోని ప్రైవేటు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు వైద్యం కోసం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గోదావరి తీర ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు.