Revanthreddy Speech in Hath Se Hath Jodo Yatra: తెలంగాణ వారసత్వ సంపద కాలగర్భంలో కలుస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందినా.... ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. "హాథ్‌సే హాథ్ జోడో యాత్ర" రెండో రోజు ములుగు జిల్లాలో కొనసాగుతోంది. నిన్న రాత్రి పాలంపేటలో బసచేసిన రేవంత్‌రెడ్డి.... ఉదయం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వర ఆలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రేవంత్‌రెడ్డి రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం, పార్టీ నేతలతో కలిసి ఆయన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. శిల్ప సంపద కలిగిన రామప్ప దేవాలయ విశిష్టత గురించి గైడ్ విజయ్ రేవంత్ రెడ్డికి వివరించారు. ఆలయ అర్చకులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కకు శాలువాలు కప్పి సన్మానించారు. తెలంగాణ వారసత్వ సంపదను కేసీఆర్ కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పురావస్తుశాఖక నామమాత్రంగా మారి... అత్యంత విలువైన కళా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రామప్పను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
'మార్పు కోసం హాథ్ సే హాథ్ జోడో యాత్ర మొదలుపెట్టా. ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని మేసిఫెస్టో విడుదల చేస్తాం. రామప్పను యునెస్కో గుర్తించినా.. రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోంది. తెలంగాణ వారసత్వ సంపద కాలగర్భంలో కలపాలని కేసీఆర్ కుట్ర. కేసీఆర్ వాస్తు పిచ్చికి కళాఖండాలు నాశనమవుతున్నాయి. ప్రత్యేక నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రామప్పను అభివృద్ధి చేస్తాం.'-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు