వాన వచ్చిందంటే చాలు.. వరద వచ్చి.. ఊరు మునిగిపోతుంది: గ్రామస్థులు Flood effect on Papaiahpally village : భారీ వర్షాలు సహా గోదావరి జలాల విడుదలతో రామప్ప సరస్సు నిండినప్పుడల్లా.. ఆ గ్రామ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ముంపునకు గురైన ప్రతిసారి అధికారులు.. వేరే ప్రాంతానికి తరలించి చేతులు దులుపుకుంటున్నారు. సురక్షిత ప్రాంతంలో ఇళ్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదని ములుగు జిల్లా పాపయ్యపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వానకాలం వచ్చేలోగా తమకు శాశ్వత గూడు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లికు చెందిన 40 కుటుంబాలు.. రామప్ప సరస్సు వల్ల ముంపును ఎదుర్కొంటున్నాయి. భారీ వర్షాలు, వరదలకు తోడు.. దేవాదుల పైపుల ద్వారా గోదావరి జలాలను రామప్ప సరస్సులో నింపుతున్నారు. ఇక్కడి నుంచి యాసంగి పంటకు నీరు ఇచ్చేందుకు.. రంగయ్య, పాకాల, గణపురం చెరువులకు నీరు మళ్లిస్తున్నారు. యాసంగి పూర్తైయ్యే సరికి రామప్ప సరస్సులో 25 అడుగులు నీటిమట్టం ఉంటుంది. వానకాలంలో వచ్చే వరదలతో 30 నుంచి 36 అడుగుల వరకు నీటిమట్టం పెరుగుతుంది. దీంతో పాపయ్యపల్లి నీట మునుగుతుంది. ముంపు సమయంలో గ్రామంలోని 40 కుటుంబాలను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు.
సురక్షిత ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇవ్వాలని బాధితులు ములుగు జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. సమస్య తీరడం లేదని వాపోయారు. కలెక్టర్ ఆదేశాలతో ఇటీవల గ్రామంలో సర్వే నిర్వహించారు. అయితే గ్రామస్థులు ఎందుకు సర్వే చేస్తున్నారని వారిని అడిగినా సరే.. అందుకు తగిన సమాధానం చెప్పడం లేదని వాపోయారు. పైగా ఇళ్లల్లో ఉన్న వ్యక్తుల పేర్లనే నమోదు చేసుకుంటున్నారని.. లేని వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరి కాకుండా.. తమ గోడును పట్టించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమపై త్వరగా దయచూపాలని ముంపు బాధితులు కోరుతున్నారు.
"2021-22లో అకాల వర్షాలకు ఊరి చుట్టూ నీళ్లు కమ్ముకుని ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వరదలో మేముంటే అధికారులు వచ్చి మమ్మల్ని బాహ్య ప్రపంచంలోకి తీసుకొని వెళ్లారు. బట్టలు, బియ్యం పూర్తిగా తడిసిపోతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా వరదలు వచ్చినప్పుడు పునరావాస కేంద్రాల్లో ఉంటున్నాం. ఈసారైనా చర్యలు తీసుకోమని అధికారులను వేడుకుంటున్నాం. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా మా సమస్య పరిష్కరించమని కోరుకున్నాం" - పాపయ్యపల్లి వాసులు
ఇవీ చదవండి: