ఆమె గిరిజన బిడ్డలకు అండగా నిలుస్తోంది. ప్రజల కోసం నిత్యం పరితపిస్తోంది. ప్రభుత్వం సాయం చేయకపోయినా తన వంతుగా సహాయం చేస్తోంది. భూదేవి అంత సహనంతో ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తోంది. ఆమె సీతక్క.. ఈరోజు ఆమె పుట్టిన రోజు.. సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా రాజకీయంగా అక్కడ ఎంతో కొంత హడావుడి ఉంటుంది. అదే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వెళ్తే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడో అతికొద్ది మంది మాత్రమే నిరాడంబరంగా ఉంటూ ప్రజాసేవ కోసం పరితపిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు సీతక్క.
చిన్నతనంలోనే అడవిబాట
చిన్నతనంలోనే ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక.. అడవి బాట పట్టారు. సంవత్సరం కూడా నిండని కొడుకుని అమ్మకు అప్పగించి పీడిత వర్గాల కోసం పోరాడారు. జైలు జీవితం గడిపారు. జనజీవితంలోకి వచ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతో బడుగుబలహీన వర్గాలకు మద్దతుగా నిలవాలని న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ప్రజామనిషి కావటంతో ఆమెను ములుగు ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకున్నారు. కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం పరితపించారు. కొండలు, అడవులు దాటికి గిరిజన బిడ్డలకు సాయం చేశారు. నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు. నిత్యావసర సరకులు అందించారు.
కూరగాయల మూట తలపై పెట్టుకుని..
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం నుంచి పెనుగోలు దూరం 20 కి.మీ. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న ఆ గ్రామానికి చేరుకోవాలంటే కాలినడకే శరణ్యం. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సీతక్క సైతం సుమారు 15 కి.మీ కాలినడకన నడిచారు. అవకాశం ఉన్నచోట మధ్యలో కొద్దిదూరం ద్విచక్ర వాహనం ఎక్కినప్పటికీ ఎక్కువ భాగం కాలినడకనే వెళ్లి పెనుగోలు చేరుకున్నారు. ఇలా పేదలకు అండగా నిలుస్తూ నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు ఐరన్ లేడీ సీతక్క.