ఎన్నో ఏళ్లుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటోన్న గిరిజనులు, గిరిజనేతరుల భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆమె మండిపడ్డారు. ఆదివాసీలపై అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాంపెక్స్లో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.
పట్టాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదు
ములుగు జిల్లా పరిధిలోని తొమ్మిది మండలాల్లో వందల ఏళ్లుగా గిరిజనులు, గిరిజనేతరులు జీవనం సాగిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. ఎన్నో ఏళ్ల క్రితమే పోడు చేసి వ్యవసాయం చేసుకుంటున్న వారి భూములను హరితహారం పేరుతో అటవీ శాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. తాతల కాలం నుంచి సాగులో ఉన్న పోడు భూముల జోలికి ఎవరైనా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.