ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే అయినందుకా తనపై ఇంత వివక్ష అని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడంలో ఇరిగేషన్ అధికారుల ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ములుగు జిల్లాలో రామప్ప సరస్సు నుంచి కాల్వ గేట్ల ప్రారంభానికి తనను పిలవలేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి ఏం అధికారం ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పక్క జిల్లా అధికారులు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తుంటే అధికారులు ఎలా ఊరుకుంటారని ప్రశ్నించారు. అదే వారి జిల్లాకు వచ్చి పెత్తనం చెలాయిస్తే ఆ ప్రజాప్రతినిధులు ఒప్పుకుంటారా అని మండిపడ్డారు.
రామప్ప చెరువు నిండితే నష్ట పోయేది తమ రైతులేనని, నీట మునిగేది తమ భూములేనని అన్నారు. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గేట్లను ఎత్తివేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.