ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని అడవి రంగాపూర్ (నారాయణపూర్) గ్రామంలోని బండ్లపాడు గుత్తికోయగూడేనికి స్థానిక ఎమ్మెల్యే సీతక్క వెళ్లారు. కాలినడకన, ఎడ్లబండ్లపై ప్రయాణం చేస్తూ గిరిజన ప్రాంతానికి చేరుకుని వారికి నిత్యావసర సరుకులు అందించారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం పేదలను ఆదుకోకపోవడం దారుణమని సీతక్క మండిపడ్డారు. అడవినే నమ్ముకొని బతుకుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా విపత్తు వేళ ప్రజల వద్దకు వెళ్లి సాయం చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క - MLA Seethakka on corona situations
సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా రాజకీయంగా అక్కడ ఎంతోకొంత హడావుడి ఉంటుంది. అదే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వెళ్తే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడో అతికొద్ది మంది మాత్రమే నిరాడంబరంగా ఉంటూ ప్రజాసేవ కోసం పరితపిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. కరోనా కష్టసమయంలో ఎంతోకొంత సహాయం చేయాలని భావించిన సీతక్క.. గత కొద్దిరోజులుగా ప్రజల వద్దకే నేరుగా వెళ్తున్నారు. కొన్నిచోట్ల నిత్యావసరాలు అందివ్వడం, భోజన సౌకర్యాలు కల్పించడం.. ఇలా తన పరిధిలో చేయాల్సిన సహాయం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రతి పేదవాడి కుటుంబానికి రూ.6 వేలు అందించి ప్రభుత్వం ఆదుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫౌంహౌస్‌ను వీడి.. ప్రజల మధ్యకు రావాలంటూ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లే వైరస్ పట్టణాల నుంచి మారుమూల గ్రామాలకూ విస్తరించి.. ప్రజల ప్రాణాలను హరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా పరీక్షలను పెంచి.. లాక్‌డౌన్ కారణంగా పనులు దొరక్క ఇబ్బందులు పడుతోన్న ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: Corona Victims : అడవిలో తలదాచుకున్న కరోనా బాధితులు