కాల్వ గేట్లను ప్రారంభించే కార్యక్రమానికి ఇరిగేషన్ అధికారులు ప్రొటోకాల్ నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప సరస్సు నుంచి వంగపల్లి, గణపురం చెరువులకు నీటిని తరలించేందుకు కాల్వ గేట్లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వస్తున్నారని ఇరిగేషన్ అధికారులు ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తెలియజేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు.
గేట్ల ఎత్తివేతకు ఎమ్మెల్యే సీతక్కను పిలవలేదని నాయకుల ఆగ్రహం
రామప్ప సరస్సు నుంచి కాల్వ గేట్లను ప్రారంభించే కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే సీతక్కను పిలవలేదని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. కాల్వ కింద భూములను కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించలేదని ఆరోపించారు.
ఈ కాల్వ కింద పంట భూములు కోల్పోయిన రైతులు రెండేళ్లుగా అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా.. పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. వారికి సర్ది చెప్పి ఆయన గేట్లను ఎత్తివేశారు. భూనిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంత చిన్న కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క అవసరం లేదని.. కాంగ్రెస్ నాయకులు గొడవ చేయడం పద్ధతి కాదని అన్నారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ ధరకే ప్రైవేటులో కొవిడ్ చికిత్స : మంత్రి ఈటల