మేడారం జాతర దగ్గరకు వచ్చినా... ఇంకా పనుల పరిశీలన, సమీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని పనులు కొలిక్కి రాగా... మరికొన్ని నింపాదిగా నడుస్తున్నాయి. ప్రధానంగా మేడారానికి వెళ్లే పలు రహదారుల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వరంగల్, మేడారం రహదారిలో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా కన్పించటం లేదు. మేడారానికి వెళ్లే అన్ని మార్గాలు, రహదారులను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. జాతర దగ్గర పడుతున్నా పనులు ఇంకా పూర్తిచేయలేదని ఆర్ అండ్ బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
జాతర దగ్గరపడినా పూర్తికాని మరమ్మతులు... - MINISTERS INSPECTION IN MEDARAM ARRANGEMENTS
రాష్ట్రంలో జరిగే మహా జాతరకు సమయం దగ్గరపడింది. భక్తుల రద్దీ ఇప్పటికే పెరిగిపోయింది. కానీ రహదారుల మరమ్మతులు మాత్రం పూర్తి కాలేదు. పనులు పరిశీలించిన మంత్రులు కంగుతిన్నారు. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు... ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
కటాక్షపూర్ వద్ద నిర్మాణం చేసిన కాజ్‌వే ను మంత్రులు ప్రారంభించారు. అక్కడి నుంచి మేడారం చేరుకొని తాత్కాలిక బస్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం సమ్మక్క- సారలమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రహదారుల మరమ్మతులన్నీ.. మూడు రోజుల్లో పూర్తవుతాయన్నారు. సీఎం కేసీఆర్ ఈనెల 7న మేడారానికి విచ్చేస్తారని మంత్రులు వెల్లడించారు. గవర్నర్ తమిళిసై కూడా జాతరకు విచ్చేయనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ నీరు సరఫరా మెరుగయ్యేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పోటెత్తుతున్న భక్తులు
సౌకర్యాల సంగతి ఎలాగున్నా... భక్తులు మాత్రం మేడారానికి పోటెత్తుతున్నారు. బస్సుల ద్వారానే కాక ప్రైవేట్ వాహనాల్లోనూ చేరుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. అందరి సమన్వయం సహాకారంతో జాతర విజయవంతంగా జరుగుతుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు.