తెలంగాణ

telangana

ETV Bharat / state

వనదేవతలకు చివరిరోజు భక్తుల మొక్కులు.. జనసంద్రమైన మేడారం - telangana news

Medaram jathara 2022: మేడారం మహా జనజాతర విజయవంతమైందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు స్పష్టం చేశారు. ఈ సారి దాదాపు కోటి 30 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అంచనా వేశారు. మరోవైపు వన జాతర ముగింపు ఘట్టానికి చేరుకుంది. వనం నుంచి వచ్చిన దేవతలు.. ఈ రాత్రి తిరిగి వన ప్రవేశం చేయడంతో నాలుగు రోజుల వన వేడుక పరిసమాప్తం కానుంది.

'వనదేవతలకు చివరిరోజు భక్తుల మొక్కులు.. జనసంద్రమైన మేడారం'
'వనదేవతలకు చివరిరోజు భక్తుల మొక్కులు.. జనసంద్రమైన మేడారం'

By

Published : Feb 19, 2022, 12:56 PM IST

Updated : Feb 19, 2022, 2:40 PM IST

'మేడారం మహా జనజాతర విజయవంతమైంది'

Medaram Jathara 2022: వన జాతర భక్తజన సాగరమైంది. మేడారం వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. గురువారం సమ్మక్క తల్లి కొలువు దీరింది. నలుగురూ గద్దెలపై ఆశీనులవడంతో శుక్రవారం వన దేవతల నిండు జాతరకు జనం పోటెత్తారు. క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. జంపన్నవాగు తీరమంతా భక్త ప్రవాహమైంది. ఇప్పటి వరకు కోటి 30లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అంచనా వేశారు. దర్శనాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి భక్తులు తరలివచ్చారు.

నేడు వనప్రవేశం..

గద్దెలపై కొలువుదీరి మొక్కులు అందుకుంటున్న అమ్మవార్లు శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు. వన దేవతలను రెండేళ్లకోసారి ఘనంగా స్వాగతించడం, గద్దెలపై ప్రతిష్ఠించి మొక్కులు సమర్పించడం, నాలుగో రోజు వన ప్రవేశం చేయించడం ఆదివాసీ సంప్రదాయం. అమ్మవార్ల వన ప్రవేశంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.

సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపారు..

మేడారం జాతర విజయవంతమైందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు వెల్లడించారు. ఎలాంటి లోపాలు జరగకుండా జాతర విజయవంతమైందన్నారు. మేడారం జాతరపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మేడారం జాతరకు ఏమీ చేయకుండా... ఇక్కడకు వచ్చి అమ్మవార్ల చెంత రాజకీయ విమర్శలు ఏంటని భాజపా నాయకులను ఎర్రబెల్లి ప్రశ్నించారు. కుంభమేళాకు రూ.325 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. అతిపెద్ద ఆదివాసీ జాతరకు కేవలం రెండున్నర కోట్లు ఇవ్వడం ఏంటని నిలదీశారు. గిరిజనులు అంటే చులకన వల్లే.. ప్రధాని మోదీ, అమిత్‌ షా.. ఇతర కేంద్ర మంత్రులు మేడారానికి రావడం లేదని విమర్శించారు.

మేడారం విజయవంతమైంది. ఎలాంటి లోపాలు జరగకుండా జాతర విజయవంతం చేయడంలో అధికారుల చొరవ అభినందనీయం. మేడారం జాతరపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు.

-ఎర్రబెల్లి దయాకర్​ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి

ఉద్యోగులకు అభినందనలు..

ఈసారి దాదాపు కోటి 30 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అంచనా వేశారు. కరోనా వల్ల జాతర ఎలా జరుగుతుందోనని భయపడ్డామన్న ఆయన.. అమ్మవారి ఆశీస్సులతో అంతా సవ్యంగా జరిగిందన్నారు. అధికారులు చక్కని సమన్వయంతో పనిచేశారన్న మంత్రి.. అన్ని శాఖల ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

అధికారులు చక్కని సమన్వయంతో పనిచేశారు. అన్ని శాఖల ఉద్యోగులకు అభినందనలు. దాదాపు 1.30 కోట్ల మంది దర్శించుకున్నారని అంచనా. కరోనా వల్ల జాతర ఎలా జరుగుతుందోనని భయపడ్డాం.

-ఇంద్రకరణ్​ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

నిలువెత్తు బంగారం సమర్పించుకున్న రేవంత్​

వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని రేవంత్​ సమర్పించుకున్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు మేడారం జాతర ప్రతీకని వారు తెలిపారు.

నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్న రేవంత్​

ఇదీ చదవండి:

Last Updated : Feb 19, 2022, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details