ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, ముళ్లకట్ట పుష్కర ఘాట్లను గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరి సహా వాగులు, వంకలు ఉప్పొంగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని గ్రామాలు ముంపునకు గురవ్వడం వల్ల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ నేపథ్యంలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ముంపు గ్రామాలు ఏటూరునాగారాన్ని సందర్శించారు. వారితో పాటు ములుగు జడ్పీ ఛైర్మన్ జగదీష్, ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ హన్మంత్ పాల్గొన్నారు.
అన్నదాతను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఎమ్మెల్యే సీతక్క
వర్షాలు బీభత్సం సృష్టించాయని అధికారులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చూశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. కానీ... అసలు సమస్య ఇప్పడే ఉందని, ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆమె ఆందోళన వ్యక్యం చేశారు. అన్నదాతలను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె స్పష్టం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు.