ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మినీ జాతర వచ్చే నెల 24 నుంచి 27 వరకు జరగనుంది. ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పది లక్షల పైనే రానున్నారు. గతేడాది జరిగిన మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
కరోనా కారణంగా మూత...
కరోనా కారణంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాలతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మ గుడి కూడా మూతపడింది. లాక్డౌన్ కారణంగా అమ్మవార్ల దర్శన భాగ్యానికి భక్తులు నోచుకోలేకపోయారు. అన్లాక్ అయ్యాక కూడా నవంబరు వరకు గుడి తలుపులు తెరవకపోవటం వల్ల భక్తులు గేటు ముందే మొక్కులు తీర్చుకున్నారు. నవంబర్ 1న గుడి తలుపులు తెరవటం మొదలు... ఆది, బుధ, గురువారాల్లో భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు.
వర్షాల ధాటికి రోడ్లు ఛిద్రం...
ఈ ఏడాది భారీ వర్షాలు కురవటం వల్ల పస్ర నుంచి మేడారం రహదారి చాలా వరకు పాడైపోయింది. నవంబర్, డిసెంబర్ నెలలో జంపన్నవాగులో ఊరట్టం, నార్లపూర్, కొత్తూరు, మేడారం, పడిగాపురం ఇసుక క్వారీలు ప్రారంభించగా... లారీల రాకపోకలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి. రోజురోజుకు భక్తులు రాక పెరుగుతున్నప్పటికీ... అధికారులు మాత్రం రోడ్డు మరమ్మతు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. అక్కడక్కడ తూతూమంత్రంగా రిపేరు చేసి చేతులు దులుపుకుంటున్నారు. లారీల రాకపోకలతో ఆ మరమ్మతులు కాస్తా... ఒక్క రోజుకే పరిమితమవుతున్నాయి.
వచ్చే నెల 24 నుంచి 27 వరకు జరగనున్న మినీ జాతరకి భారీ సంఖ్యలో భక్తులు... తమతమ సొంత వాహనాల్లో రానున్నారు. ఈ రహదారి ఇలాగే ఉంటే మాత్రం రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండాపోతోందని వాపోతున్నారు.