తెలంగాణ

telangana

మేడారం మినీ జాతర ప్రారంభం.. వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు

By

Published : Feb 1, 2023, 4:50 PM IST

మేడారంలో జాతర సందడి మొదలైంది. మండ మెలిగే పండుగగా పిలిచే మినీ జాతర ప్రారంభమైంది. ఇందులో భాగంగానే పూజారులు వనదేవతల ఆలయాలను శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. మరోవైపు మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి.

Medaram Mini Jatara
Medaram Mini Jatara

Medaram Mini Jatara in Mulugu: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మినీ జాతర ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సమ్మక్క, సారలమ్మ పూజారులు డోలు వాయిద్యాలతో పసుపు, కుంకుమ పువ్వులు పండ్లతో సమ్మక్క గుడికి చేరుకొని శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. జాతర ప్రారంభం రోజున ఆచారం ప్రకారం మేడారం గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా పూజారులందరూ డోలి వాయిద్యాలతో బయలుదేరి తోరణాలు కట్టారు. బెల్లం పానకం, కల్లు,నీరు ఆరబోసి మండమెలిగే పండుగ జరుపుకున్నారు. ఇదేవిధంగా కన్నెపల్లి గ్రామంలోని సారలమ్మ దేవాలయంలో పూజారులు ఆలయాన్ని శుద్ధిచేసి అందులో ఉన్న వస్తువులకు పసుపు,కుంకుమలతో అలంకరంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.

భక్తులతో రద్దీగా మారిన మేడారం పరిసర ప్రాంతాలు:మరోవైపు మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. మొదటి రోజే జాతరకు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా.. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలకు పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, బంగారం సమర్పించారు. ముడుపులు కడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద భక్తుల సందడి నెలకొంది. నాలుగు రోజులపాటు సాగే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం రూ.3కోట్లు వెచ్చించి అన్ని ఏర్పాట్లు చేసింది. వన దేవతల గద్దెలపై చలువ పందిళ్లు వేశారు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించింది. జంపన్న వాగుకు ఇరువైపులా స్నాన ఘట్టాలు, జల్లు స్నానాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులను ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య పనుల కోసం 300 మంది కార్మికులను నియమించారు.

4 లక్షల నుంచి 5.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా: మినీ జాతరలో నాలుగు నుంచి ఐదున్నర లక్షల మంది భక్తులు తల్లుల దర్శనానికి వస్తారని అంచనా వేశారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మేడారానికి వచ్చే భక్తుల కోసం హనుమకొండ, వరంగల్, ఇతర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

మేడారం మినీ జాతర ప్రారంభం.. వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇవీ చదవండి:జోరుగా 'హాథ్‌ సే హాథ్‌ జోడో' యాత్ర.. వారానికి ఓ సమస్యపై ఛార్జిషీట్‌

'ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న కేంద్రం.. ఇదే క్లాసిక్ ఉదాహరణ'

Union Budget 2023 :​ అమృత కాలపు బడ్జెట్​.. నవభారతానికి బలమైన పునాది : మోదీ

ABOUT THE AUTHOR

...view details