గద్దెలపైకి వనదేవతల చేరికతో మేడారం మహాజాతరలో తొలి అంకం ఘనంగా జరిగింది. నాలుగు రోజులు పాటు వైభవంగా జరిగే ఉత్సవాల్లో... మొదటి రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెలపై ప్రతిష్టించడమే. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగుండ్ల నుంచి మంగళవారం బయలుదేరి... 66 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం రాత్రి పగిడిద్దరాజు చేరుకున్నారు. ఏటూరినాగారం మండలం కొండాయ్ నుంచి 23 కిలోమీటర్లు ప్రయాణించి గోవిందరాజు మేడారానికి వచ్చారు.
అంతకుముందు కన్నెపల్లిలో... పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో సారలమ్మను గద్దెలపైకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం... ఆద్యంతం భక్తిశ్రద్ధలతో సాగింది. పుట్టమన్నుతో ఆలయాన్ని శుద్ధి చేసి, సంప్రదాయ పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం ఊరేగింపుగా సారలమ్మను మేడారానికి తీసుకువెళ్లారు.
జనంతో కిటకిట
మేడారానికి వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారాయి. జంపన్నవాగు పరిసరాలు... జనంతో కిటకిటలాడాయి. రహదారిపైనే చాలాసేపు నిరీక్షించిన భక్తుల్లో... సారలమ్మ రాక భక్తిపారవశ్యాన్ని నింపింది. డప్పు శబ్ధాలు, డోలు వాద్యాల నడుమ... జంపన్నవాగు మీదుగా గద్దెల వద్దకు సారలమ్మ చేరుకుంది.