మాఘ మాసంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క- సారలమ్మ జాతరకు మేడారం సిద్ధమైంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ జాతరకు... కోటి మందికిపైగానే భక్తులు వస్తారు. పూర్తిగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం విగ్రహాలు కానీ ప్రతిరూపాలు కానీ లేకుండా... 4 రోజుల పాటు కోలాహలంగా వనంలో జరిగే సంబురమిది.
రాత్రికి గద్దెల వద్దకు..
ఆదివాసీ జాతరలో తొలి రోజు... పూజారులు వెంటరాగా.. డప్పు శబ్దాలు.. డోలు వాద్యాల నడుమ... సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వేంచేయనున్నారు. ఇందుకోసం.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి.. బయలుదేరిన పగిడిద్దరాజు రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేసి.. రాత్రికి గద్దెల వద్దకు చేరుకుంటారు.
కన్నేపల్లి నుంచి సారలమ్మ..
ఇదే సమయంలో.. కన్నెపల్లి నుంచి సారలమ్మ.. ఏటూరునాగారం మండలం.. కొండాయ్ నుంచి గోవిందరాజులను కూడా తీసుకువచ్చి.. గద్దెలపైకి తీసుకురానున్నారు. ఈ ప్రక్రియతో జాతర లాంఛనంగా ప్రారంభమైనట్లవుతుంది. వేర్వేరు గ్రామాల నుంచి వచ్చి.. ముందుగా సమ్మక్క పూజా మందిరం దగ్గర దేవతలంతా కలుసుకుంటారు. సమ్మక్క అనుమతి పొందిన తరువాతే.. ఈ దేవతలంతా.. గద్దెలపైకి చేరుకుంటారు.
జనసందోహం..
జాతరను పురస్కరించుకుని మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. జంపన్న వాగు వద్ద భక్తుల సందడి... రోజు రోజుకీ పెరుగుతోంది. వంతెనకు ఇరువైపులా.. జన సందోహం.. కనపడుతోంది. పుణ్యస్నానాలు ఆచరించి.. గద్దెల వద్దకు బయలుదేరుతున్నారు.