రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర... నాలుగురోజుల పాటు వైభవంగా జరిగింది. మనరాష్ట్రమే కాకుండా పక్కరాష్ట్రాల భక్తులు కూడా హాజరయ్యే జనజాతర... చివరి దశకు వచ్చేసింది. అమ్మవార్ల వనప్రవేశంతో ముగియనుంది. గద్దెల వద్ద పూజారులు రాత్రి కాసేపు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం... సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును పొనుగండ్లకు, గోవిందరావును కొండాయికి తరలిస్తారు.
మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గద్దెలపైనున్న వనదేవతలను దర్శించుకునేందుకు... భక్తజనం క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. గద్దెల పరిసరాలన్నీ... భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మూడు రోజుల్లో రాలేని భక్తులు... ఇవాళ మేడారానికి వచ్చి దర్శించుకుంటారు. రాత్రి ఆరున్నర వరకూ దర్శనాలు కొనసాగుతాయి. ఆ తరవాత అమ్మల వనప్రవేశం కోసం... కాసేపు దర్శనాలు నిలిపివేసినా... మళ్లీ యథావిధిగా కొనసాగుతాయి.