Medaram hundi income: సమ్మక్క-సారలమ్మ జాతరలో మొత్తం రూ.11,45,34,526 ఆదాయం వచ్చినట్లు మేడారం దేవాలయ కార్యనిర్వాహణ అధికారి రాజేంద్రం తెలిపారు. జాతరలో ఏర్పాటు చేసిన హుండీ, తిరుగువారంలో వచ్చిన 517 హుండీలను హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో లెక్కించారు.
10 రోజుల పాటు సాగిన ఈ లెక్కింపు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 631 గ్రాముల బంగారం, 48.350 కిలోల వెండి ఆభరణాలు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ-హుండీ ద్వారా రూ.3 లక్షలతో పాటు విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు కానుకలుగా సమర్పించారని పేర్కొన్నారు. 2020-జాతరలో రూ.11.64 కోట్ల ఆదాయం వచ్చింది.
పటిష్ఠ భద్రత నడుమ లెక్కింపు..
సీసీ కెమెరాల పటిష్ఠ భద్రతల మధ్య మేడారం హుండీ లెక్కింపు జరిగింది. లెక్కించిన నగదును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులకు అప్పగించి బ్యాంకులో జమ చేశారు. దేవస్ధానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కింపు జరిగే మండపం పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజుల పాటు లెక్కింపు జరిగింది. ఏ రోజుకారోజు వచ్చిన ఆదాయాన్ని అధికారులు బ్యాంకుల్లో జమచేశారు.