Medaram jatara parking: మేడారం జాతరకు వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాలను అధికారులు సిద్ధం చేశారు. జాతరకు సుమారుగా 4 లక్షల 75 వేల వాహనాలు రావచ్చనే అంచనాతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని ఊరట్టం నుంచి మొట్లగూడెం వరకు సుమారు 1050 ఎకరాల్లో 33 ప్రదేశాల్లో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేశారు.
మేడారం పార్కింగ్ నమూనా చిత్రం ప్రత్యేక నిబంధనలు అమలు
parking arrangements: మేడారం జాతరకు వచ్చే ప్రతి ప్రైవేటు వాహనాలకు ప్రత్యేక నిబంధనలు విధించారు. జాతరలో 33 పార్కింగ్ ప్రదేశాలను గుర్తిస్తూ ఆయా గ్రామాల పేర్లతో పాటు ఆయా స్థలాలను ఎ నుంచి ఎక్స్ వరకు వరుస క్రమంలో కేటాయించారు. వరంగల్ తదితర ప్రాంతాల నుంచి పస్రా మీదుగా మేడారం జాతరకు చేరుకోవాలనుకునే వారికి తిరుగు ప్రయాణంలో వేరే మార్గాన్ని సూచించినట్లు పార్కింగ్ స్థలాల ఇంఛార్జి డీఎస్పీ దేవేందర్ రెడ్డి తెలిపారు.
మేడారంలో సిద్ధమైన పార్కింగ్ ప్రత్యేక నెంబర్లు కేటాయింపు
private vehicles parking: ఖమ్మం నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు ఏటూరునాగారం మండలం చిన్నబోయిన పల్లి నుంచి కొండాయి, దొడ్ల మీదుగా వచ్చే ప్రైవేటు వాహనాల కోసం భాషుగూడెంలో ఎ1 నుంచి ఎ2, ఎ3, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి కాటారం మీదుగా వచ్చే వాహనాలు ఊరట్టం, బయ్యక్కపేట గ్రామాల్లోని బి1, బి2, బి3, బి4, బి5 పార్కింగ్ స్థలాల్లో పార్కింగ్ చేస్తారు. హైదరాబాద్, వరంగల్ నుంచి పస్రా మీదుగా వచ్చే వారికోసం మొట్లగూడెం నుంచి మొదలుకుని కన్నెపల్లి వరకు సీ1, సీ2, డీ1, డీ2, ఇ1, ఇ2 నుంచి ఎక్స్ నెంబర్ పార్కింగ్ స్థలాలను కేటాయించారు.
తాడ్వాయి రహదారిలో వీవీఐపీ పార్కింగ్
medaram jatara: పస్రా నుంచి మేడారం దారిలో మొట్లగూడెం, వెంగ్లాపూర్, చింతల్ క్రాస్ రోడ్డు, నార్తాపూర్, కొత్తూరు, మరాసుర రిజర్వు ఫారెస్టు, ఎర్ర చెరువు, తదితర ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. తాడ్వాయి రహదారిలో కామారం, మేడారం సమీపంలో రెండు వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ స్థలాలను, ఆర్టీసీ బస్సుల కోసం మేడారంలో సమీపంలో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. అలాగే పార్కింగ్ ప్రదేశాల వద్ద విద్యుత్తు, మరుగుదొడ్లు, తాగునీరు, వైద్యం, భద్రత, తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.
జాతర సమయంలో పస్రా-మేడారం రహదారి ప్రైవేటు వాహనాలు కేవలం మేడారం వెళ్లేందుకు మాత్రమే అవకాశమిస్తారు. వరంగల్ తదితర ప్రాంతాల నుంచి పస్రా మీదుగా మేడారం జాతరకు వచ్చే వాహనాలు తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి, గొల్ల బుద్దారం, రాంపూర్, కమలాపూర్ క్రాస్ నుంచి భూపాలపల్లి మీదుగా వరంగల్ చేరుకుంటాయి. కాటారం, చిన్నబోయిన పల్లి మార్గాల నుంచి వచ్చే వాహనాలు తిరుగు ప్రయాణంలో కూడా యధావిధిగా వచ్చిన దారి గుండానే వెనుదిరుగుతాయి. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తాడ్వాయి-మేడారం రహదారిని వినియోగిస్తాయి.