తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం చిన జాతరకు పోటెత్తిన భక్తజనం - మేడారం చిన్న జాతర

వాగులో పుణ్య స్నానాలు.. శివసత్తుల పూనకాలు.. నెత్తిన బంగారంతో.. తల్లీ సల్లంగచూడు.. కరుణించి కాపాడమ్మా.. అంటూ మేడారం అంతా సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారుమోగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం నుంచి మండమెలిగే(చిన జాతర) ఘనంగా ప్రారంభమైంది. మహాజాతర తర్వాత ఏడాదికి నిర్వహించే మండమెలిగే పండగలో ఆదివాసీˆ గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించాయి.

medaram chinna jathara latest news
medaram chinna jathara latest news

By

Published : Feb 25, 2021, 8:04 AM IST


చిన్న జాతర పూజలు మేడారం, కన్నెపల్లిలో బుధవారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. మేడారంలో సిద్దబోయిన, కొక్కెర, చందా వంశీయులు, కన్నెపల్లిలో కాక వంశీయులు మండమెలిగె పండగ సందర్భంగా అమ్మవారి ఆలయాలను శుద్ధి చేశారు. సమీప గుట్ట నుంచి గడ్డి, పుట్ట మట్టిని తీసుకొచ్చారు. ఆలయంలో ఆడపడుచులు అలుకల్లి ముగ్గులు వేశారు. తెల్లని వస్త్రాలు ధరించి సిద్ధబోయిన మునీందర్‌ ఇంటి వద్ద పూజారులందరూ సమావేశమయ్యారు. పండుగ పూజలపై మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి సిద్ధబోయిన లక్ష్మణ్‌ ఇంటికి చేరుకుని పూజకు సంబంధించిన మామిడి తోరణాలు, కంకణాలు, ఇతర పూజా సామగ్రిని తయారు చేసుకున్నారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గ్రామదేవతలైన బొడ్రాయి, ముత్యాలమ్మ, పోతురాజు, పోచమ్మ దేవతలకు పూజలు నిర్వహించారు. తర్వాత దుష్ట శుక్తులు గ్రామానికి రాకుండా గ్రామానికి తూర్పు పడమరలో రెండు బూరగ చెట్ల కొమ్మలతో ధ్వజ స్తంభాలను పాతి దిష్టితోరణాలను కట్టారు. బెల్లం, గంజి, శాకలను ఆరగించారు. తిరిగి పూజా మందిరానికి వెళ్లారు. అనంతరం ఊరట్టంలోని మాజీ ఎమ్మెల్యే చర్ప భోజరావు కుటుంబీకులు సమర్పించిన చల్లపెయ్యను తీసుకొచ్చారు.


రాత్రి 9 గంటలకు అమ్మవార్ల పూజా సామగ్రి అడేరాలు, పసుపు కుంకుమతో గద్దెకు బయలుదేరారు. ఈ క్రమంలో పూజారులు మువ్వలు, గంటలు ధరించి కొమ్ములు, బూరలు ఊదుకుంటూ డోలు వాయిద్యాల చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ వచ్చారు. మేడారం నుంచి సమ్మక్క, కన్నెపల్లి నుంచి సారలమ్మ పూజా సామగ్రితో తరలివచ్చారు. విద్యుత్తు దీపాలను ఆర్పి గద్దెల వద్ద ధూప దీప నైవేద్యాలు సమర్పించి, రహస్య పూజలు నిర్వహించారు. చరిత్రను మననం చేసుకున్నారు. రాత్రంతా జాగరణ చేశారు. గురువారం తెల్లవారుజామున తిరిగి అమ్మవార్లను ఆలయాలకు చేర్చనున్నారు.

అధిక సంఖ్యలో భక్తజనం..

మహాజాతరకు వచ్చినట్లే చిన్న జాతరకూ భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లకు పూలు, పండ్లు, బంగారం(బెల్లం), పసుపు, కుంకుమ, టెంకాయలతో మొక్కులు సమర్పించారు. అనంతరం కుటుంబ సమేతంగా వనభోజనాలు చేశారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు మేడారంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగు వద్ద స్నానఘట్టాల వద్ద జల్లు స్నానాల కోసం షవర్లు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం చేతిపంపులు, నల్లాలు, ట్యాంకర్లను సిద్ధం చేశారు. సులభ్‌ కాంప్లెక్సులను అందుబాటులోకి తెచ్చారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా మూడు చోట్ల పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. బందోబస్తు కోసం పోలీసు సిబ్బందిని సమకూర్చారు. వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. హన్మకొండ, ములుగు నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పించారు. భక్తుల విడిది కోసం 5 షెడ్లను అందుబాటులోకి తెచ్చారు. కొవిడ్‌ నేపథ్యంలో మాస్కు ధరించాలని దేవాదాయ అధికారులు భక్తులకు సూచించారు. జాతర ఏర్పాట్లను ములుగు ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జి.పాటిల్‌, ఐటీడీఏ పీవో హన్మంతు కొండిబా జెండగే పర్యవేక్షించారు.


ఇదీ చూడండి:యాసంగిలో దేశంలోనే తెలంగాణ టాప్

ABOUT THE AUTHOR

...view details