Devotees at Sammakka Saralamma Temple: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆదివారం కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలి వచ్చిన భక్తులు మొదటగా జంపన్న భాగంలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం వనదేవతలను దర్శించుకుంటున్నారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దల వద్ద భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. సమ్మక్క సారలమ్మ వనదేవతలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులకు కొబ్బరికాయలు కొట్టి పసుపు, కుంకుమ చల్లి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల చుట్టూ ఉన్న అడవిలో చెట్ల కింద భోజనాలు వండుకొని అక్కడే విడిది చేసి పిల్లపాపలతో సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం చేస్తున్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వహకులు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు శనివారం ములుగు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం, ఏటూరు నాగారం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిరిశెట్టి సంకీర్త్ మరికొందరు అధికారులు ఆలయానికి వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.