తెలంగాణ

telangana

ETV Bharat / state

హోం క్వారంటైన్‌పై నిఘా కరవు

ములుగు జిల్లాలో హోం క్వారంటైన్‌ రోగులపై నిఘా కరవైంది. ఏటూరునాగారం, మంగపేట మండలంలోని మంగపేట, రాజుపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు బహిరంగంగా తిరుగుతున్నారు. వారిపై నిఘా లేకుండా పోయింది. దీంతో మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఏటూరునాగారం వైటీసీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో గురువారం నాటికి 62 మంది చేరారు. జాకారం వైటీసీలో 59 మంది బాధితులు ఉన్నారు.

mulugu district updates
కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు

By

Published : Apr 24, 2021, 4:16 PM IST

హోం ఐసోలేషన్‌ సదుపాయం ఉన్న రోగులను వైద్యులు వారి అభిప్రాయం మేరకు ఇళ్లలోనే ఉండాల్సిందిగా చెప్పి పంపిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే ఇళ్లలో ప్రత్యేక గదుల్లో పరిమితమవుతుండగా, కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. బయట తిరుగుతూ కరోనా వాహకులుగా మారుతున్నారు. సాధారణంగా లక్షణాలు బయటికి కనిపించని వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే వారి ఆరోగ్య పరిస్థితినిబట్టి క్వారంటైన్‌ కేంద్రానికి గాని, ఐసోలేషన్‌ కేంద్రానికి గాని తరలిస్తున్నారు. 2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్‌ 22 వరకు జిల్లాలో మొత్తం 6011 మందికి పాజిటివ్‌ వచ్చిందని ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య తెలిపారు. రెండో దశలో మార్చి 6 నుంచి ఇప్పటి వరకు 846 పాజిటివ్‌ కేసులు వచ్చాయని పేర్కొన్నారు.

153 పాజిటివ్‌ కేసులు

ములుగు జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో 153 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలతో పాటు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రిలో 3113 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

వెంకటాపురం మండలంలోని ఎదిర పీహెచ్‌సీ, వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. మండలంలోని 107 మంది వద్ద నమూనాలను సేకరించి ర్యాపిడ్‌ కిట్ల ద్వారా వైద్యసిబ్బంది పరీక్షించారు. 13 మందికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లు తేలిందని వైద్యాధికారి నరేశ్‌ తెలిపారు.

3823 మందికి టీకా పంపిణీ

ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో 3823 మందికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. మరో 15 మంది రెండో డోసు తీసుకున్నారు. ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని వైద్యాధికారులు పెర్కొన్నారు.

కరోనా కట్టడికి ప్రజలు తమ వంతు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు బయట తిరిగి ఇతరులకు అంటించే ప్రయత్నం చేయవద్దు. ఇల్లు లేదా ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలి. కేసులు విస్తృతంగా నమోదవుతున్న నేపథ్యంలో అనవసరంగా బయట తిరగొద్ధు.

---------------- అల్లెం అప్పయ్య, జిల్లా వైద్యాధికారి

ఇదీ చదవండి:రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details