కరోనా మహమ్మారి.. ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కన్న పేగు బంధాలను కర్కశంగా తెంచేసింది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెను భారం మోపింది. వారి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది. లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రైవేటు సంస్థల్లో లక్షలాది రూపాయలు వేతనం తీసుకున్న వారూ కొలువులు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తున్నవారు కొందరైతే.. సొంతూరుకు వెళ్లి పొలం బాట పట్టినవారు మరికొందరు.
ములుగు జిల్లా మంగపేట మండలం దోమెడలో గుండెలు పిండుతున్న దృశ్యం ఒకటి కంటపడింది. బీఎస్సీ, బీఈడీ, పీజీ చేసిన ఇద్దరు అన్నదమ్ములు కాడెద్దులుగా మారిన దృశ్యమిది. కరోనా రక్కసి ఛేష్టలకు.. జన జీవితాలు ఎంతటి దుర్భరంగా మారాయో ఈ దృశ్యమే సజీవ సాక్ష్యం.