తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎడతెరపిలేని వర్షాలు... కళకళలాడుతున్న వాగులు... - telangana weather updates

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలతో... వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో... వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఉత్తర తెలంగాణలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణశాఖ తెలిపింది.

ఎడతెరపిలేని వర్షాలు... కళకళలాడుతున్న వాగులు...
ఎడతెరపిలేని వర్షాలు... కళకళలాడుతున్న వాగులు...

By

Published : Aug 15, 2020, 4:29 AM IST

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. వరంగల్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. హన్మకొండ, కాజీపేటలో లోతట్టు ప్రాంతాలు నీట మునగగా... ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లోకి మురుగునీరు రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడం వల్ల.... పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ములుగులోనూ...

ములుగు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. వాజేడు మండలంలోని వరిపంటలు నీటమునిగాయి. జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో.... మేడారం-వస్రా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెంకవాగు, జిన్నెలవాగు, కంకలవాగు, బల్లకట్‌వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. తిప్పాపురం వాగును దాటేందుకు యత్నించి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కొత్తగూడలో బొగ్గుల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా... లక్నవరం సరస్సు మత్తడి పోస్తోంది. గోవిందరావుపేట, ప్రాజెక్ట్ నగర్ గ్రామాల మీదుగా దయ్యాల వాగు పొంగిపొర్లుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా 80శాతం చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వరి నాట్లు వేసిన పొలాలు నీట మునిగాయి.

ఖమ్మంలోనూ...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా ఉండడంతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద ప్రవాహానికి పర్ణశాల వద్ద సీతమ్మ నారచీరల ప్రాంతం నీటిలో మునిగిపోయింది.

సిద్దిపేటలోనూ...

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదుల బంధం గ్రామంలో తుంతుంగ వాగు పొంగి పొర్లుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: నీట మునిగిన దేశం.. నిండా మునగకూడదంటే?

ABOUT THE AUTHOR

...view details