Telangana Rains Today : రాష్ట్రవ్యాప్తంగా ముసురు పట్టుకుంది. రెండురోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. నిజామాబాద్ శివారులో గూపన్‌పల్లి ఉన్నత పాఠశాల వర్షపు నీటితో చెరువును తలపించింది. దీంతో బడికి వచ్చిన విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు.ఎడతెరిపి లేని వానలతో వాగులు వంకలు జలకళ సంతరించుకున్నాయి. పలు చోట్ల తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. సిరికొండ మండలంలో గడ్కోల్, తూంపల్లి, కప్పల వాగులు జలకళను సంతరించుకున్నాయి. నవీపేట్ మండలంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతోంది. నిజామాబాద్ -హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు వర్షంతో అంతరాయం కలిగింది.
Heavy Rains in Joint Karimnagar Disrict : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలుకురుస్తున్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వానలతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రెండు రోజులుగా ముసురు నెలకొనటంతో రైతులు వరి నాట్లకు సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడురోజులుగా ముసురు పట్టుకుంది. లోతట్టు ప్రాంతాల్లోని నివాస సముదాయాల్లో నీళ్లు నిలిచి స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు :ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో రహదారులు జలమయ్యాయి. హనుమకొండ జిల్లా పరకాలలోని చలివాగు అలుగు పోస్తోంది. పైడిపల్లి శివార్లలో కొత్తగూడెంలో ఓ పాత పెంకుటిల్లు కూలి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గార్ల శివారులో పాకాల వాగు ప్రవాహంతో రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కూలీలతో కలిసి నాట్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే : ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిన్నగంగారం వద్ద పాలెం వాగు జలాశయం ప్రధాన కాలువకు గండి పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లి ఏజెన్సీలోని తిప్పాపురం, పెంకవాగు, కలిపాక, మల్లాపురం, రాజపల్లి సహా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఎలిసెట్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు గర్భిణులను విపత్తు నిర్వహణ బృందాలు బోటు సహాయంతో వాగు దాటించారు. అనంతరం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. ఏటూరునాగారంలోని ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ త్రిపాఠి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా రెండురోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా హవేళిఘనాపూర్ మండల పరిధిలోని చౌట్లపల్లి, శుక్లాల్ పేట్ శివారులో మహిళా కూలీలతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నాట్లు వేశారు.
వరద నీటితో జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు, చెరువులు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా జోరు వాన కురుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని మండలాల్లో వర్షం కురుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులు, చెరువులకు జలకళ సంతరించుకుంటున్నాయి. గుండాల మండలంలో గుండాల-కోడవటంచ లోలెవల్ వంతెన పైనుంచి కిన్నెరసాని ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలం శంభునిగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ప్రహరీ వెంబటి ఉన్న వృక్షం నేలకొరిగింది. వర్షం కారణంగా అటువైపు ఎవరు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. సత్తుపల్లి నియోజకవర్గంలో బేతుపల్లి చెరువుకు వరద ప్రవాహం పెరిగింది.