medaram sammakka sarakka: సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మరో మూడ్రోజులే ఉండగా...మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుండడంతో... రద్దీ అధికంగా ఉంటుంది. కుటుంబసమేతంగా వచ్చిన భక్తులు అమ్మవారికి చీర, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో అనేక మంది మేడారానికి వస్తుంటే... కొందరు భక్తులు కాలినడకన తల్లులను దర్శించుకుంటున్నారు.
11 జాతరలకు కాలినడకనే...
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నుంచి 250 మంది యువకులు... మేడారానికి కాలినడకన పయనమయ్యారు. మార్గమధ్యలో గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. 11 జాతరలకు కాలినడకనే వచ్చినట్లు వీరు చెబుతున్నారు. ఖమ్మం నుంచి మరికొంతమంది భక్తులు కుటుంబ సమేతంగా కాలినడకన మేడారానికి బయల్దేరారు. కోరిన కోర్కెలు తీర్చిన సమ్మక్క సారలమ్మలను.... కాలినడకన వెళ్లి దర్శించుకుంటామని... మొక్కుకున్నట్లు వారు తెలిపారు.