కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే వెల్లడించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం జరుగుతున్నట్లు చెప్పారు. రాహుల్ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు ఆయన వివరించారు. మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్ రెడ్డిల అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రధాన అజెండాగా చర్చించారు.
ఈ సందర్భంగా ఈ నెల 6న మొదలయ్యే జోడో యాత్రలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు పాల్గొంటారని మాణిక్‌రావు పేర్కొన్నారు. ఉత్తమ్, భట్టి, మధుయాష్కీ ఇతర ముఖ్య నేతలు వివిధ ప్రాంతాల్లో ఈ యాత్రను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
''రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను హాత్ సే హాత్ జోడో ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాహుల్ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యం. రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో కొనసాగుతుంది.''-మాణిక్‌రావు ఠాక్రే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ
గవర్నర్ పచ్చి అబద్ధాలతో అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను పొగిడారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్న ఈ తరుణంలో ఆ ఇద్దరు నాటకాలకు తెర తీశారని.. అందుకు రాజ్‌భవన్‌ను వేదికగా వాడుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు అనేక విషయాల్లో కేసీఆర్ పనితీరును ప్రశ్నించిన గవర్నర్.. ఇప్పుడు స్వరం మార్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను గవర్నర్ కాపాడే ప్రయత్నం చేశారన్నారు. అన్ని విషయాల్లో వైఫల్యం చెందిన కేసీఆర్ అబద్ధాలను గవర్నర్ కప్పిబుచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ విధానాలు అన్నీ ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తాము ముందు నుంచీ చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.